
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
ములుగు రూరల్: ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి గుండె అనసూయ అన్నారు. ఈ మేరకు శనివారం ఇంచర్ల శివారులోని కేన్ కంపెనీ ఆయిల్ పామ్ నర్సరీని, ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,775 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో సాగుకు అంచనా వేస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతుల సహకారంతో లక్ష్యం చేరుకుంటామని వివరించారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు 5 వేల ఎకరాలు దాటితే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపడుతారని , రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేన్ కంపెనీ కొనుగోలు చేస్తుందన్నారు. పంటసాగులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎకరాకు రూ.లక్ష మేర లాభం వస్తుందని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులు నేరుగా ఉద్యనశాఖ అధికారిని కలువాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు, కేన్ కంపెనీ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.