
మందులు పంపిణీ చేస్తున్న వైద్య సిబ్బంది
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని రైతులు పత్తి నిల్వలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఎ క్రాంతికుమార్ సూచించారు. మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేయగా ఆయన హాజరై పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తికి సరైన మద్దతు ధర రాకపోవడంతో రైతులు ఇళ్లలోనే పత్తిని నిల్వ చేసుకోవడం వల్ల పత్తిలో పురుగులు ఉంటాయని తెలిపారు. వాటి వల్ల మనుషులకు దద్దుర్లు, దురద వంటి చర్మ సమస్యలు వస్తాయని తెలిపారు. వాటికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఈ శిబిరంలో వైద్యులు చీర్ల శ్రీకాంత్, లోకప్రియ, పీహెచ్‌ఎన్ శోభ, ఏఎన్‌ఎంలు స్వప్న, కనకలక్ష్మి, ఆశ కార్యకర్తలు సరోజన, మాధవి, సౌజన్య, కవిత, సంపూర్ణ, శోభ, ఇందిర తదితరులు పాల్గొన్నారు.