
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్
ములుగు రూరల్: చూడి పశువుల పోషణలో పెంపకందారులు మెళకువలు పాటించాలని కేవీకే.శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న సూచించారు. మండల పరిధిలోని మల్లంపల్లిలో పీవీ నర్సింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం, జాతీయ మాంసాభివృద్ధి సంస్థ హైదరాబాద్, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మేళా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ వైవీ.గణేష్, డాక్టర్ షేక్ మీరా, సంచాలకులు అటారిలు హాజరై కిసాన్ మేళాను ప్రారంభించారు. ముందుగా స్వచ్ఛమైన పాల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరదీపికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాకారంలో పశువులకు గర్భకోశ వ్యాధుల పరీక్షలు నిర్వహించామన్నారు. పశు పోషణలో ఆధునిక పద్ధతులను పాటించాలని సూచించారు. మహిళా రైతులు పెరటి కోళ్ల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో కేవీకే ద్వారా జగ్గన్నపేట, పులిగుండం, పొట్లాపూర్, బండారుపల్లి గ్రామాల్లో సుమారు 4,500 కోళ్లను పంపిణీ చేశామని వివరించారు. జిల్లాలో పశుపోషణ, చేపల పెంపకానికి అనువుగా ఉంటుందని తెలిపారు. కిసాన్ మేళా ప్రదర్శనలో రాజశ్రీ కోళ్లు, నెల్లూరు గొర్రె పొట్టేలు, వివిధ రకాల పశుగ్రాసం రైతులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో జాతీయ మాంసాభివృద్ధి సంచాలకులు బార్ బుద్ధే, డాక్టర్ బసవరెడ్డి, సర్పంచ్ చందా కుమార్, శాస్త్రవేత్తలు అరుణజ్యోతి, సౌమ్య, హనుమంతరావు, సహాయ సంచాలకులు కరుణాకర్, రవీందర్, వెంకటేశ్, జిల్లా పశు వైద్యాధికారి విజయభాస్కర్, శ్రీధర్, నవత, రైతులు పాల్గొన్నారు.