
తమిళసినిమా: అందం తిన్నానండి. అందుకే ఇలా ఉన్నాయండి అని ఒక పాటలో తన అందం గురించి తానే పొగుడుకున్న నటి తమన్నా భాటియా. అది నిజం కాకపోయినా ఈమె అందగత్తె అన్నది ముమ్మాటికీ నిజం అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఇప్పటికే బిజీగా ఉన్న తమన్నా వయసు 33 ఏళ్లు. నటిగా గత 18 ఏళ్లుగా తన అందాలను రకరకాల కోణాల్లో తెరపై ఆరబోస్తూనే ఉన్నారు. ఇటీవల నటించిన జైలర్ చిత్రంలో కూడా తాజా అందాలతో మెరిసిపోయి, ప్రేక్షకులను మైమరిపించారు.
అంతగా అభిమానులకు కిక్ ఇస్తున్న తన అందం రహస్యాన్ని తమన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఈ గ్లామర్ ప్రపంచంలో ఫిట్నెస్‌గా ఉండడం చాలా అవసరం అన్నారు. అందుకు శారీరక కసరత్తులు ఎంత ముఖ్యమో, ఆహారపు అలవాట్లు అంతే ముఖ్యమని పేర్కొన్నారు. తాను ఆహారపు అలవాట్లకు ప్రాముఖ్యతనిస్తానన్నారు.
ఉదయం నట్స్, ఖర్జూరపండ్లు, అరటి పండ్లను సమానంగా తీసుకుని తింటానని చెప్పారు. మధ్యాహ్నం భోజనంలో బ్రౌన్ రైస్, పప్పు, కాయకూరలు తీసుకుంటానన్నారు. అదే విధంగా సాయంత్రం 5.30 డిన్నర్ ముగించేస్తానని, ఆ తరువాత మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తిననని చెప్పారు. ఇలా 12 గంటలు తినకుండా ఉంటానన్నారు. దీంతో చర్మం కాంతులీనుతుందని చెప్పారు. ఇక గ్రీన్ టీ, ఆమ్లాజ్యూస్ వంటివి తన ఆరోగ్య రహస్యం ఒక భాగం అని మిల్కీ బ్యూటీ పేర్కొన్నారు.