‘ఆనందో బ్రహ్మ, యాత్ర, యాత్ర 2’ వంటి సినిమాలు నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి తమ 70ఎంఎం ఎంటర్‌టైన్ మెంట్స్‌పై సందీప్ కిషన్ హీరోగా ‘పవర్ పేట’ అనే సినిమాని ప్రకటించారు. ‘ప్రస్థానం’ (2010) సినిమాతో చిత్ర పరిశ్రమలో తన కెరీర్ మొదలు పెట్టిన సందీప్ కిషన్ ఏప్రిల్ 16వ తేదీకి 16 సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘పవర్ పేట’ మూవీని ప్రకటించారు.
ఈ సినిమాకి రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నారు. ‘‘విభిన్న జానర్లను కలిపి ఒక పవర్‌ఫుల్ కథను తయారు చేశారు కృష్ణ చైతన్య. బలమైన కథలను ఎంచుకోవడంలో పేరు పొందిన సందీప్ కిషన్ తన కెరీర్‌లోనే ‘పవర్ పేట’ చిత్రంలో అత్యంత ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా ప్రేమ, గౌరవం, భావోద్వేగాలు, రాజకీయాలను ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: మది.


