Sudheer Calling Sahasra Movie Teaser Released By Allu Aravind: సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరియయం అక్కర్లేని పేరు. మెజీషియన్‌గా అందరి దృష్టిన ఆకర్షించిన సుధీర్ ఓ కామెడీ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. తనదైన యాంకరింగ్, కామెడీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్. అలా వచ్చిన క్రేజ్‌తో వెండితెరపై హీరోగా మారాడు. విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలతో అలరించిన సుధీర్ తాజాగా 'కాలింగ్ సహస్ర' అనే డిఫరెంట్ క్రైం స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుడిగాలి సుధీర్.

ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం (ఏప్రిల్ 1) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక నిమిషం 18 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్‌లో ప్రతి సన్నివేశం ఆసక్తి పెంచేలా ఉంది. 'బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది', 'చివరగా చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా.. మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్లు పోవడం' అనే డైలాగ్‌లతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఈ మూవీలో క్రైంతోపాటు మంచి లవ్ యాంగిల్ ఉన్నట్లు తెలుస్తోంది. రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ సంయుక్త సమర్పణలో విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలుగా వ్యవహరించారు. అరుణ్ విక్కీరాల దర్శకత్వం వహించగా మోహిత్ రహ్మణియక్ సంగీతం అందించారు.


