
‘‘మిరాయ్’ చిత్ర సంగీతం, నేపథ్య సంగీతానికి థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషాన్నిచ్చింది. చిత్ర నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ కూడా చక్కని మ్యూజిక్ ఇచ్చానంటూ నన్ను అభినందించారు. సినిమా విడుదల తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. నా ఫోన్‌కి కాల్స్ ఏకధాటిగా వస్తూనే ఉన్నాయి. చాలా మెసేజ్‌లు కూడా వచ్చాయి. అయితే ఆ సమయంలో నేను జ్వరంతో ఉండటం వల్ల ఎక్కువ కాల్స్ మాట్లాడలేకపోయాను’’ అని సంగీత దర్శకుడు హరి గౌర చెప్పారు.
తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన చిత్రం ‘మిరాయ్’. టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు హరి గౌర విలేకరులతో మాట్లాడుతూ–‘‘హనుమాన్, మిరాయ్’ వంటి బ్యాక్ టు బ్యాక్‌పాన్ ఇండియా హిట్స్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్‌గారు చాలా అద్భుతమైన సినిమా తీశారు. కీరవాణిగారు లాంటి లెజెండరీ కంపోజర్‌తో నన్నుపోల్చడం ఆనందాన్ని ఇచ్చినప్పటికీ.. అదే సమయంలో భయంగా, బాధ్యతగా అనిపిస్తోంది.
ఈ సినిమా కోసం ‘వైబ్ ఉంది బేబి...’ తోపాటు మరో స్పెషల్ సాంగ్‌ని చిత్రీకరించాం. అయితే ఎడిటింగ్‌లో చూసుకుంటే.. కథ ఫ్లోకి ఇబ్బంది కలిగిస్తుందేమో అనే ఫీలింగ్ కలిగింది.. దీంతో యూనిట్ అంతా కలిసి ఆపాటలను తీసేయాలనే నిర్ణయం తీసుకున్నాం. అయితే ఓటీటీ స్ట్రీమింగ్‌లో మాత్రం ‘వైబ్ ఉంది బేబి...’ సాంగ్ ఉంచాలనుకుంటున్నాం. ఇండస్ట్రీలో నాది పదేళ్ల ప్రయాణం. కన్నడలో ‘చార్మినార్’ వంటి హిట్ చిత్రం తర్వాత తెలుగులో నిరూపించుకోవాలని ఇక్కడికి వచ్చాను. ‘తుంగభద్ర, డియర్ మేఘ, గాలివాన’ వంటి సినిమాలు చేశాను. దర్శక–నిర్మాతల నమ్మకాన్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్‌లో చాలా టైమ్ పట్టింది’’ అన్నారు.