
Puneeth Rajkumar Eyes Donated: భారత సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(46) మరణ వార్తతో అందరి గుండెలు బరువెక్కాయి. కన్నడనాట ఎక్కడ చూసిన అభిమానుల రోదనలు మిన్నంటుతున్నాయి. చిన్న వయసులో తమ అభిమాన హీరో, సహానటుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ఇది నిజం కాదు.. ప్లీజ్ తిరిగి రా అప్పు’ అంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆయన చనిపోయిన కూడా మరొకరి ద్వారా ఈ లోకాన్ని చూడనున్నారు. ఈ సూపర్ స్టార్ తన కళ్లను దానం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఫ్యాన్స్ సోషల్ మీడియా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా ఈ రోజు ఉదయం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు.