మమ్ముట్టి(Mammootty) నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఆయన జీవించేస్తాడు. తెరపై స్టార్‌లా కాకుండా పాత్రకు తగ్గ నటుడిలాగానే కనిస్తాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేశారు. అందులో ఒకటి ‘భ్రమయుగం’(Bramayugam). గతేడాది విడుదలైన ఈ చిత్రం ఎన్ని రికార్డులకు క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. భారీ వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుంది. తాజాగా 55వ కేరళ రాష్ట్ర సినిమా అవార్డుల్లోనూ(Kerala State Film Awards 2025) ఈ చిత్రం సత్తా చాటింది. నాలుగు ప్రతిష్ఠాత్మక విభాగాల్లో అవార్డులను సాధించింది.
ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, ఉత్తమ సహాయ నటుడిగా సిద్ధార్థ్ భరతన్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా రోనెక్స్ జేవియర్ అవార్డులు గెలుపొందారు. ఈ అవార్డుతో మమ్ముట్టి ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్ర స్థాయిలో అత్యధిక సార్లు(7) ఉత్తమ నటుడి విభాగంలో అవార్డు అందుకున్న నటుడిగా మమ్ముట్టి రికార్డు సృష్టించారు.
భ్రమయుగంలో తాంత్రిక విద్యలు తెలిసిన కొడుమోన్ అనే పాత్రను మమ్ముట్టి పోషించారు. . ఈ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన తీరు.. భారతదేశపు అత్యుత్తమ నటుల్లో ఒకరిగా ఆయన స్థాయిని పునరుద్ఘాటించింది. కొన్ని తరాలకు గుర్తుండిపోయే సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మక సరిహద్దులను చెరిపివేసి.. మలయాళ సినిమా ఎలా ముందుకు వెళుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగా 'భ్రమయుగం' నిలిచింది.
నిర్మాతలు రామచంద్ర చక్రవర్తి (నైట్ షిఫ్ట్ స్టూడియోస్), ఎస్. శశికాంత్ (వైనాట్ స్టూడియోస్) తమ సినిమా సృజనాత్మక దృష్టిని గుర్తించినందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జ్యూరీ, విమర్శకులు, మీడియా మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“ఈ అవార్డులు ప్రయోగాత్మక కథలపై మా నమ్మకాన్ని మరింత బలపరిచాయి. మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి, కేరళ సినిమాకు కొత్త దారులు చూపే ప్రయత్నాలను కొనసాగించడానికి ఇవి మాకు ప్రేరణగా నిలుస్తాయి. మా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.” అంటూ నిర్మాతలు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
గత సంవత్సరం విడుదలై విశ్వవ్యాప్త ప్రశంసలు అందుకున్న 'భ్రమయుగం' చిత్రానికి రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వం వహించారు. మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి అద్భుతమైన తారాగణం నటించారు.


