చిన్నశంకరంపేట(మెదక్): ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు సిబ్బ ందిని ఆదేశించారు. గురువారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నార్సింగి జాతీయ రహదారి, మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల నిఘాను పెంచాలని ఎస్‌ఐ సృజనకు సూచించారు. సమావేశంలో సీఐ సైదానాయక్, సిబ్బంది ఉన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంతోశ్‌కుమార్, ప్రదీప్ చిన్నశంకరంపేట జీపీ కార్యదర్శులుగా పనిచేసిన సమయంలో వివాదస్పద స్థలంలో ఎలాంటి పత్రాలను పరిశీలించకుండా బాధ్యత రాహిత్యంగా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం సంతోష్‌కుమార్ పాపన్నపేట, ప్రదీప్ కామారం జీపీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
నర్సాపూర్: జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, క్యాటరింగ్, స్వీపింగ్, సానిటేషన్ పనుల నిర్వహణకు టెండర్‌దారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏసీఓ గంగరాంనాయక్, స్థానిక గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్ డీసీఓ బలరాం తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 5లోపు దరఖాస్తు అందజేయాలని సూచించారు.
మెదక్ కలెక్టరేట్: ఎన్‌ఐయూఎం బృందం (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్) గురువారం పట్టణంలో పర్యటించి పలు అంశాలపై అధ్యయనం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నవీన్ తెలిపారు. పట్టణంలో కోతుల బెడదతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి స్టడీ చేసినట్లు చెప్పారు. అందులో భాగంగా ప్రజలు, విద్యార్థులు, యాత్రి కులతో మాట్లాడారన్నారు. అలాగే మెదక్ ఫోర్ట్‌ను సందర్శించి టూరిస్టులతో మాట్లాడారు. కోతుల బెడద నివారణకు శాశ్వత పరిష్కారానికి ఈ బృందం సభ్యులు ప్రణాళిక రూపొందించనున్నట్లు వివరించారు. అనంతరం డంప్‌యార్డును సందర్శించి ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, కంపోస్ట్ షెడ్‌లో తడి చెత్తతో ఎరువు తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు, పర్యావరణ శాఖ ఇంజినీర్, పారిశుద్ధ్య జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): సహకార సంఘాలు ఆర్థికాభివృద్ధిలో రాణించేందుకు కృషి చేయా లని జిల్లా సహకార అధికారి పద్మ అన్నారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల పరిధిలోని ఫరీద్‌పూర్ సొసైటీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా రైతులనుద్దేశించి ఆమె మాట్లాడారు. సొసైటీ ద్వారా రైతులకు సేవలందించడంతో పాటు ఆర్థికాభివృద్ది సాధించాలన్నారు. అనంతరం రైతులకు అందించే సేవలు, వ్యాపార కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బ్రహ్మం, గ్రామ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.


