● రాష్ట్రస్థాయిలో జిల్లాకు 7వ స్థానం
● కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో ధాన్యం సేకరించామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే లక్ష మెట్రిక్ టన్నులు అత్యధికంగా రైతులు దిగుబడులు సాధించారని అన్నారు. అనేక ఒడుదుడుకుల నడుమ అందరి సహకారంతో జిల్లాలో సంపూర్ణంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. అలాగే రెండురోజుల్లో మొక్కజొన్న కూడా పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఉన్నందున రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం మాన్సూన్ ముందస్తు ప్రణాళికపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దోమలు ఉత్పత్తి చెందకుండా లార్వాలను నిర్మూలించాలని తెలిపారు. హైరిస్క్ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే దిశగా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులన్నింటినీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం యూరియాను యాప్‌లోనే కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, సివిల్ సప్లై జిల్లా అధికారులు నిత్యానంద్, జగదీష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు, డీపీఆర్‌ఓ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.


