రైతుల ఇబ్బందులపై మంత్రి సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

రైతుల ఇబ్బందులపై మంత్రి సీరియస్‌

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, క్షేత్ర స్థాయిలో సమస్యలను వెంటనే ఎందుకు పరిష్కరించడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని బస్వాపూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు లేకపోవడం, కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తక్షణమే స్పందించిన మంత్రి అక్కడికక్కడే కలెక్టర్‌ హైమవతికి ఫోన్‌ చేసి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులు గంటల తరబడి వేచి చూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం సన్న రకానికి ఇచ్చే రూ.500 బోనస్‌, సాధారణ రకానికి కనీస మద్దతు ధర రైతులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సీజన్‌లో పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయడామే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించవద్దని మంత్రి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరిగినా.. రైతులకు సౌకర్యాలకల్పనలో లోపాలున్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సంబంధిత అధికారులను హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement