 
															తెరిపిచ్చిన వాన
వడ్లను ఆరబెట్టే పనిలో నిమగ్నం
ముసురుతో తడిసిన ధాన్యం
ఊపిరి పీల్చుకున్న రైతన్న
మోంథా తుపాన్ ప్రభావంతో మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా ముసురు పెట్టింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. గురువారం వాన తెరిపివ్వడంతో వడ్లను ఆరబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
– మెదక్‌జోన్
జిల్లాలో ఈ ఏడాది 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. గత నెల రోజులుగా వరి కోతలు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు, 518 సెంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు 500 పైచిలుకు కేంద్రాలను ప్రారంభించారు. చాలా సెంటర్లకు ధాన్యం రావటంతో 15 రోజులుగా కొనుగోళ్లు ప్రారంభించారు. కాగా మోంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా ముసురు పెట్టింది. అధికారుల సూచన మేరకు రైతులు వరికోతలను నిలిపివేశారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తడవకుండా అన్నదాతలు జాగ్రత్తలు పడినప్పటికీ చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం నుంచి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం
వరి కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి మ్యాచర్ వచ్చాక కొనుగోలు కేంద్రాలకు తరలించారు. వర్షాలకు ధాన్యం రాశుల అడుగుభాగం తడిసి కొంతమేర వడ్లు మొలకొచ్చాయి. పైభాగంలోని ధాన్యాన్ని మరోచోట పోసి అడుగుభాగంలో మొలకెత్తిన ధాన్యాన్ని ఎండలో ఆరబెడుతున్నారు. మరో పక్క తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. గురువారం సుమారు 200 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వర్షంతో చాలా సెంటర్లలో కొనుగోళ్లు నిలిపి వేయగా, ప్రస్తుతం 200 కేంద్రాల్లోనే ధాన్యం విక్రయాలు ప్రారంభించారు. కాగా ఆరబెట్టిన ధాన్యాన్ని త్వరతగతిన కొనుగోలు చేసి వర్షం నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
15 రోజులు అవుతోంది
నాకున్న 5 ఎకరాల్లో వరి పంట పండించి 15 రోజుల క్రితం మెదక్ మార్కెట్‌లో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రానికి తరలించాను. కాగా వర్షానికి కొంతమేర ధాన్యం తడిసి మొలకెత్తింది. దీంతో మళ్లీ ఆరబెట్టాను. త్వరగా కొనుగోలు చేసి ఆదుకోవాలి.
– హన్మంతు, రైతు,
నవాబుపేట

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
