 
															ట్రాన్స్‌ఫార్మర్ కోసం లంచం
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో డీఈ 
మెదక్ కలెక్టరేట్: ఏసీబీకి మరో ప్రభుత్వ ఉద్యోగి చిక్కాడు. పౌల్ట్రీ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా మెదక్ ట్రాన్స్‌కో డీఈ షేక్ చాంద్ షరీఫ్ భాషను గురువారం రెడ్‌హ్యండేడ్‌గా పట్టుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన పాపగారి భాస్కర్ బ్యాంకు నుంచి రూ. 18 లక్షల లోన్ తీసుకొని గ్రామంలో నూతనంగా పౌల్ట్రీఫాం ఏర్పాటు చేస్తున్నాడు. కరెంట్ కోసం సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ కావాలని ట్రాన్స్‌కో డీఈని సంప్రదించాడు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు రూ. 2.19 లక్షలకు పైగా ఖర్చు అవు తుందని అంచనా వేసి ఇచ్చారు. రూ. 30 వేలు లంచం ఇస్తే రూ. 1.10 లక్షలకే ట్రాన్స్‌ఫార్మర్ ఇస్తా మని తెలిపారు. డీఈ సూచన మేరకు రూ. 9 వేలు నాగారం బాల్‌రాజ్ అనే వ్యక్తికి ఫోన్‌పే ద్వారా పంపించాడు. మిగితా రూ. 21 వేలు ఇస్తేనే పనులు ప్రారంభమవుతాయని డిమాండ్ చేయగా, ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం ట్రాన్స్‌కో డీఈ కార్యాలయంలో డీఈకి రైతు భాస్కర్ రూ. 21 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండేడ్‌గా పట్టుకున్నారు. ఈసందర్భంగా బాధితు రైతు మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ కోసం మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు పీఏ ద్వారా ఫోన్ చేయించానని, ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ పనిచేస్తాడా? ఎవరు చెప్పిన వినేది లేదని డీఈ దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
