 
															కొనుగోళ్లు వేగవంతం చేయండి
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
హవేళిఘణాపూర్(మెదక్): ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతులు పండించిన ధాన్యాన్ని వెంటవెంటనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని శాలిపేట కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన టార్పాలిన్లు అందజేసి ధాన్యం ఆరబెట్టుకునేలా చూడాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికనప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సింధూరేణుక, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఉన్నారు.
తాగునీరు పునరుద్ధరించండి
తాత్కాలిక మోటార్లు ఏర్పాటు చేసి శుక్రవారం సాయంత్రంలోపు హవేళిఘణాపూర్ మండలంలోని 32 గ్రామాలకు తాగు నీటి సరఫరాను పునరుద్ధరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని జక్కన్నపేట పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా మిషన్ భగీరథ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు మోటార్లు కాలిపోవడంతో వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని వారు తెలిపారు. భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
