 
															రైతుల తిప్పలు కనిపించవా?
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
చిన్నశంకరంపేట(మెదక్): మోంథా తుపాన్‌తో రైతుల ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతుంటే ఇన్‌చార్జి మంత్రికి సోయిలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం నార్సింగి మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. 15 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినా, ఇప్పటివరకు ఒక్క క్వింటా కొనుగోలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పడిందని, ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధాన్యం తడిసి, పంటలు దెబ్బతింటే కనీసం క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదని వాపోయారు. జిల్లాపై కనీస అవగాహన లేకుండా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. జిల్లాలోని అధికారులు తక్షణం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని, లేకుంటే ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, రణం శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మైలారం బాబు, భూపతిరాజ్, రాజశేఖర్ ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
