
ఆమెకు పౌష్టికాహారం
● వచ్చేనెల 16 వరకు పోషణ మాసం
● బతుకమ్మ సంబరాల్లో వినూత్న ప్రయత్నం
● 40 రకాల ఆకుకూరలతో ప్రసాదాలు
మెదక్ కలెక్టరేట్: మహిళల్లో అనారోగ్య సమస్యలు, రక్తహీనత నివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు పోషణమాసం నిర్వహణకు శ్రీకారం చుట్టింది. విజయవంతానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. లోకల్ ఫర్ వోకల్ నినాదంతో స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో లభించే 40 ఆకుకూరలను అధికారులు గుర్తించారు. వీటిని బతుకమ్మ సంబురాల్లో మహిళలు ప్రసాదంగా ఉపయోగించుకునేలా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,300 వేల పైచిలుకు మహిళా సంఘాలు ఉండగా, 1.37 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. జిల్లాలోని పట్టణాలతో పాటు ప్రతి గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి వారిలో పోషకాహార లోపం, రక్తహీనత నివారణపై ఛాలెంజ్ పోటీలు నిర్వహిస్తున్నారు.
పోషకాహార ప్రదర్శన
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, బస్టాండ్లు, చౌరస్తాలలో పోషకాహార ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా గర్భిణులు, బాలింత మహిళలతో పాటు కిశోర బాలికలు తీసుకోవాల్సిన సమతుల ఆహారం, ప్రోటీన్లు ఉన్న పప్పు దినుసులు, ఆకుకూరలు ఆహారంలో తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. పెద్దవారి కోసం బీఎంఐ పరీక్షలు, పిల్లల కోసం ఎత్తు, బరువు, కొలతలు తీయడం, ఆహారంలో చక్కెర, నూనె వినియోగాన్ని తగ్గించే విషయంపై అవగాహన కల్పించనున్నారు.
ప్రతి ఇంటికీ పోషణ సందేశం
చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహా రాన్ని మెరుగు పర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోంది. అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పోషణ సందేశం చేరేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పోషణ మాసంలో ప్రజాప్రతిధులను సైతం భాగస్వామ్యం చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులు నిర్వహిస్తున్నారు.
ఆరోగ్యవంతులను చేస్తాం
మహిళలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల్లో పోషకాహా ర లోపం, రక్తహీనత నివారణకు బతుకమ్మ సంబరాలను సద్వినియోగం చేసుకుంటాం. 40 రకాల ఆకుకూరలు ప్రసాదాలుగా పెట్టి ఆరగించేలా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం.
– హేమభార్గవి, ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ

ఆమెకు పౌష్టికాహారం