
కదం తొక్కిన కార్మికలోకం
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు కదం తొక్కారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెదక్ ఎమ్మార్వో కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్‌లను ముందుకు తీసుకొచ్చిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జూలై 5 తేదీన పని గంటలను పెంచుతూ జీఓ 282 తీసుకొచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కార్మికవర్గాన్ని ఐక్యం చేసి దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏసు, అమృతి, శోభ, ఎల్లవ్వ, అంగన్‌వాడీ టీచర్లు రాజ్యలక్ష్మి, లత, దుర్గా, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.