
మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం
అదనపు కలెక్టర్ నగేష్
మెదక్ కలెక్టరేట్: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను ప్రారంభించి మాట్లాడారు. విజయోత్సవ సంబరాల ఆవశ్యకత, నిర్వహణ గురించి దిశా నిర్దేశం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలను అన్ని అంశాల్లో సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా రుణాలను అందిస్తూ వివిధ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తుందన్నారు. పథకంతో లబ్ధిపొందిన మహిళలను ఆదర్శంగా తీసుకోని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈనెల 11 వరకు జరిగే సంబరాల్లో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల వారీగా వడ్డీలేని రుణాలు, ప్రమాద బీమా, లోన్ బీమాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ, కళాజాత ప్రదర్శనల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, ఏపీఎం వెంకటస్వామి, టీఎంసీ మెప్మా సునీత, స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు.