
లారీలు రావు.. బస్తాలు పోవు
ఆగ్రహించి రోడ్డెక్కిన రైతులు
కొల్చారం(నర్సాపూర్): వారం రోజులుగా కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడం, అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి మొలకలు రావడంతో ఆగ్రహించిన పైతర గ్రామానికి చెందిన రైతులు బుధవారం ఆందోళన దిగారు. రంగంపేట పీఏసీఎస్ ఎదురుగా మెదక్– జోగిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే తూకం వేసిన 5 వేల ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు బస్తాల్లోని ధాన్యం మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గంట పాటు సాగిన రాస్తారోకోతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ రైతుల వద్దకు చేరుకొని లారీలు వచ్చేలా చూస్తామని నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు.