
ఉద్యాన పంటలకు ఊతం
● ప్రస్తుతం జిల్లాలో 9 వేల ఎకరాల్లో సాగు ● వానాకాలం 2,850 ఎకరాలు లక్ష్యం ● భారీ సబ్సిడీలతో రైతులకు ప్రోత్సాహం
మెదక్ కలెక్టరేట్: రైతులు కేవలం వరికే పరిమితం కావడంతో ఆర్థికంగా ఆశించిన అభివృద్ధి సాధించలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ప్రతి రైతు వాణిజ్య పంటలు సాగు చేసి ఆర్థికాభివృద్ధి సాధించడమే కాకుండా, జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం జిల్లాలో 9 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం, పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోటలు సాగవుతున్నాయి. ఈ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందజేస్తుంది. అయితే 2025– 26 వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2,850 ఎకరాల్లో పంటల సాగు జరగాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఉద్యానవన శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులకు తెలియజేస్తూ పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయిల్‌పాం, బిందు, తుంపర సేద్యానికి లక్ష్యాలను కేటాయించింది.
జాతీయ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్
ఈ పథకం ద్వారా జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు జిల్లాకు 2025– 26 సంవత్సరానికి గాను 2,500 ఎకరాల లక్ష్యం కేటాయించారు. ఆయిల్‌పామ్ తోటలు సాగు చేసే రైతులకు గతంలో మాదిరిగానే ఎకరానికి ఏడాదికి రూ. 4,200 చొప్పున మొత్తం 4 సంవత్సరాలకు 16,800 మొక్కలపై 11,001 రాయితీ కల్పిస్తున్నారు.
మైక్రో ఇరిగేషన్
ఈ పథకం ద్వారా బిందు, తుంపర సేద్యం ద్వారా వాణిజ్య పంటల సాగుకు లక్ష్యాన్ని కేటాయించారు. ఇందులో ఆయిల్‌పాం సాగుకు 2,500 ఎకరాలు, కూరగాయలు, మిరప, మొక్కజొన్న తదితర పంటలకు 1,470 ఎకరాలు, పండ్ల తోటలకు గాను 368 ఎకరాలు, తుంపర సేద్యానికి గాను 80 ఎకరాల లక్ష్యం కేటాయించారు.
వంద శాతం సబ్సిడీ
జిల్లాలో ఆయిల్‌పాం తోటలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం చొప్పున ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తూ ప్రోత్సహిస్తుంది. అలాగే పండ్ల తోటలు, ప్లాస్టిక్ మల్చింగ్, పూల తోటల సాగు, హైబ్రిడ్ కూరగాయల నారు పండించే రైతులను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందజేస్తుంది.
రాష్ట్రీయ ఉద్యాన మిషన్
ఈ పథకం ద్వారా వివిధ పండ్ల తోటలు సాగు చేసేందుకు, హైబ్రిడ్ కూరగాయల నారు సరఫరా, పూల తోటల సాగు, ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకునే రైతులకు రాయితీ సదుపాయం క ల్పిస్తున్నారు. పండ్లతోటల సాగుకు సంబంధించి బొప్పాయి, మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో సాగు చేయదలచిన రైతులకు రాయితీ సదుపాయం లభిస్తుంది. కూరగాయలు సాగు చేసే రైతులకు సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నర్సరీ నుంచి సబ్సిడీపై హైబ్రిడ్ కూరగాయల నారు సరఫరా చేస్తున్నారు.
ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి
రైతులు లాభాలు వచ్చే ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలి. ఆయిల్‌పాం, మామిడి, జామ, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడో వంటి వాణిజ్య పంటలు సాగు చేయాలి. ప్రభుత్వం పెద్దఎత్తున సబ్సిడీలు అందిస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి.
– ప్రతాప్‌సింగ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి