
కొల్లూరులో జరిగిన సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అరవై ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరగని అభివృద్ధి, ఈ తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పత్రాలను కుత్బుల్లాపూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలోని లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పారదర్శకంగా కేటాయింపులు జరిపామని తెలిపా రు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లో కాంగ్రెస్ నేతలు లంచాలు అడిగేవారని ఆరోపించారు. ఇంటి కాగితాలు బ్యాంకుల్లో జప్తు పెట్టాల్సి వచ్చేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, మహిళల పేరుతోనే ఇంటిని కేటాయిస్తున్నారని చెప్పారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
కొల్లూరులో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడంతో పాటు, ఇక్కడ నివసించే ప్రజల కోసం ప్రభుత్వ పాఠశాల, బస్తీ దవాఖాన, రేషన్‌షాపు, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే హైకమాండ్ అని, ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌గా మారి చేసిన అభివృద్ధిని గల్లీ గల్లీకి వెళ్లి ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాష్‌గౌడ్, మాగంటి గోపీనాథ్, సంగారెడ్డి కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావు
పారదర్శకంగా ‘డబుల్’లబ్ధిదారుల ఎంపిక
అర్హులకు గృహాలక్ష్మి
కేటాయింపు పత్రాలు పంపిణీ