
● శనగ సాగు భారమే! ● నాలుగేళ్లుగా ఇదే దుస్థితి ● యాసంగి ఆశలపై నీళ్లు ● జిల్లాలో సాగు కీలకం ● త్వరలో ప్రారంభంకానున్న సీజన్
గజ్వేల్ : శనగ విత్తు సబ్సిడీ ఈసారీ లేనట్టే కనిపిస్తోంది. పక్షం రోజుల్లో సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. వానాకాలం సాగులో పంట నష్టానికి గురై యాసంగి లోనైనా ఊరట పొందాలనుకున్న రైతుల ఆశలు అడియాశలే కానున్నాయి. జిల్లాలో ఏటా యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రధాన పంట అయిన శనగ విత్తుపై నాలుగేళ్లుగా సబ్సిడీ ఎత్తేయడంతో సాగు భారంగా మారింది.
20వేల క్వింటాళ్ల విత్తు అవసరం
యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో సుమారు 30వేల ఎకరాల వరకు శనగ పంట సాగులోకి వచ్చే అవకాశముంది. ఇందుకోసం 20వేల క్వింటాళ్లకుపైగా విత్తనాలు అవసరం. మొక్కజొన్న 30వేల ఎకరాల వరకు సాగులోకి వచ్చే అవకాశం ఉండగా.. 4వేల క్వింటాళ్ల విత్తనం, పొద్దు తిరుగుడు 3,500 ఎకరాల్లో సాగులోకి వచ్చే అవకాశముండగా 550 క్వింటాళ్ల విత్తనం, వేరుశనగ 4వేల ఎకరాల్లో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో 600 క్వింటాళ్ల విత్తనం అవసరం ఉంటుంది. ప్రస్తుతం సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ వ్యవహారం చర్చనీయంశంగా మారుతోంది. నాలుగేళ్ల క్రితం శనగల అసలు ధర రూ. 6,500గా నిర్ధారించి అందులో 35శాతం సబ్సిడీ మినహాయిస్తే రైతులు క్వింటాలుకు రూ.4,225కు అందించారు. దీని ప్రకారం కిలోకు రూ. 42.25పైసలు ధర చెల్లించారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటివరకు సబ్సిడీపై ఎలాంటి ప్రకటన రాలేదంటే ఇక పంపిణీ లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇతర పంటలతో పోలిస్తే ప్రస్తుత యాసంగి సీజన్‌కు శనగ పంటే అనుకూలమైనదిగా రైతులు భావిస్తున్నారు. వానాకాలం సీజన్‌లో అతివృష్టి, అనావృష్టి వంటి భిన్నమైన పరిస్థితి కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం సంభవించింది.. ఈ కారణంగా పంటల్లో ఎదుగుదల లోపించి ఎక్కడికక్కడా తెగుళ్లు దాడి చేశాయి. ప్రస్తుతం ఈ పంటలను తొలగించి శనగ సాగుతో ఉపశమనం పొందాలనుకుంటున్నారు. ప్రధానంగా నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్న గజ్వేల్‌తో పాటు దుబ్బాక డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పంటను భారీ ఎత్తున సాగుచేస్తారు. విత్తనాలు వేసే సమయంలో నల్లరేగడిలో కొద్దిపాటి తేమ ఉంటే చాలు మొలకెత్తే అవకాశముంటుంది. ఆ తర్వాత చలికాలంలో వచ్చే పొగ మంచుతో పంటకు మంచి దిగుబడి వచ్చే అవకాశముంటుంది. అందువల్లే రైతులు ఈ పంటకు మొగ్గు చూపుతున్నారు. ఈసారి అంచనాకు మించి శనగ పంట సాగులోకి వచ్చే అవకాశమున్నది. నాలుగేళ్లుగా సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేయడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సమాచారం లేదు
శనగ విత్తు సబ్సిడీపై ఎలాంటి సమాచారం లేదు. యాసంగి సీజన్‌లో శనగ పంట కీలకమే. జిల్లాలో నల్ల రేగడి భూముల్లో శనగ ఎక్కువగా సాగు చేస్తారు. రైతుల అవసరాల మేరకు సబ్సిడీతో ప్రమేయం లేకుండా తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు అందుబాటులో ఉంచుతాం.
– శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి
