
మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షిషా
కలెక్టర్ రాజర్షిషా
మెదక్ కలెక్టరేట్: గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరవాలని, యాప్‌లో స్టేజీల వారిగా నమోదు చేసి బిల్లులు చెల్లించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో గృహలక్ష్మి పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధి దారుల వివరాలను ఎప్పటికప్పుడు ఎంపీడీఓలు నమోదు చేయాలని, గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పకడ్బందీగా పరిశీలించి ఆన్‌లైన్ చేయాలన్నారు. నియోజకవర్గం వారిగా మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలని, ఇంటి నిర్మాణ దశలకు సంబంధించిన వివరాలను జియో ట్యాగింగ్ చేసి బిల్లులు అందజేయాలన్నారు.
28లోగా రుణమాఫీ
ఈ నెల 28తేదిలోగా రైతు రుణమాఫీ డబ్బులను రైతులకు ఖాతాలకు జమ చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకుల అధికారులతో గురువారం కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 51శాతం మంది రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకున్నారని అన్నారు. మరో 49శాతం మందికి ఈనెల 28 వరకు రెన్యువల్ చేసుకునే అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయిల్‌పాం సాగుపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి సాగు పెంచేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, డీఆర్‌ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ శైలేష్ కుమార్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్, డీఎఫ్‌ఓ రవిప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖజీఎం కృష్ణమూర్తి, ఇరిగేషన్ ఈఈ యేసయ్య, పీఆర్‌ఈఈ, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు నమోదు తప్పనిసరి
అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కోసం నిర్వహించిన నాటక పోటీలు, పాటల పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు గురువారం కలెక్టరేట్‌లో బహుమతులు అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు నమోదు కోసం నిర్వహించిన స్వీప్ కార్యక్రమాలతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. జిల్లాస్థాయిలో యువ ఓటర్లు అనే అంశంపై నిర్వహించిన నాటక పోటీల్లో మెదక్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రథమ స్థానంలో నిలించింది. నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వితీయ, మెదక్ డైట్ కళాశాల తృతీయస్థానంలో నిలిచాయి. భవిష్యత్ ఓటర్లు అనే అంశంపై నిర్వహించిన నాటకానికి నర్సాపూర్ కేజీబీవీ ప్రథమ, చేగుంట తెలంగాణ మోడల్ స్కూల్ ద్వితీయ, రామాయంపేట కేజీబీవీ తృతీయస్థానంలో నిలిచింది. భవిష్యత్ ఓటర్లు అనే అంశంపై నిర్వహించిన పాటల పోటీలో టేక్మాల్ మండలలం తంప్లూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని జి. ప్రవళిక (ప్రథమ), మెదక్ బీఆర్‌ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థిని కే.నందిని(ద్వితీయ), రేగోడ్ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని స్నేహ(తృతీయ) స్థానంలో నిలిచారు. వీరికి నగదు బహుమతితోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు రమేశ్, వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, డీఈఓ రాధాకిషన్, డీఐఈఓ సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఆర్డీఓలు, ఎస్‌ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.