చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో రూ.7.50కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్(ఇంటిగ్రేటెడ్ మార్కెట్) భవనం అసౌకర్యాలకు నిలయంగా మారింది. గత జనవరిలో అసౌకర్యాల మధ్యనే హడావుడిగా ప్రారంభించి పనులు పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారుతోంది. మార్కెట్ ప్రారంభించిన సమయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీనివ్వడంతో వ్యాపారులు కూరగాయల విక్రయాలు చేపట్టారు. మూత్రశాలలు, తాగునీటి సౌకర్యాలు కల్పించకపోవడంతో మళ్లీ పాత మార్కెట్‌లో విక్రయాలు చేపడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో మూత్రశాలలు లేవు. తాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఫ్లోరింగ్, ఎండ నుంచి రక్షణకు పైన రేకులు ఏర్పాటు చేయలేదు. మార్కెట్ భవన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ అకాల మృతితో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి మరో రూ.20లక్షలు కేటాయిస్తే ఫ్లోరింగ్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, గేటు, తాగునీటి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కూరగాయలు విక్రయిస్తున్నారు. వర్షాకాలం దృష్ట్యా అధికారులు పనులు పూర్తి చేయించాలని వ్యాపారులు కోరుతున్నారు.


