మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్‌రాథోడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాలలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని, మందుల నిల్వలను స్టాక్ రిజిష్టర్‌లో నమోదు చేయడంతోపాటు గడువు తేదీలను పరిశీలించిన తర్వాతే రోగులకు ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఆడపిల్లలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు అశోక్, స్నేహిత, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.


