గతేడాదితో పోలిస్తే ‘గంగమ్మ’ పైనే.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్, చెరువుల్లోనూ నీరు వేసవిలోనూ భూగర్భ జలాల లభ్యత పట్టణ ప్రాంతాల్లో క్రమంగా తగ్గుదల విచ్చలవిడిగా బోర్లు వేస్తుండడంతోనే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మండుతున్న ఎండల్లోనూ జిల్లాలో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కోటపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి మండలాల్లోనే నీటి లభ్యత స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. ఏటా ఎండాకాలంలో మార్చి నుంచి మొదలై మేలో ఎండలు తీవ్ర రూపం దాల్చుతాయి. ఈ సమయంలో స్థానిక అవసరాల కోసం నీటి కొరత ఏర్పడుతుంది. జూన్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అప్పటివరకు స్థానికంగా ఉన్న భూగర్భ జలాలనే అన్ని అవసరాలకు వినియోగించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో యాసంగి పంటలు చేతికొచ్చి, కోతలు పూర్తవుతున్న తరుణంలో సాగునీటి అవసరం లేదు. తాగునీరు, గృహ, పరిశ్రమలు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థానికంగా ఉన్న బోరు బావులు, తాగునీటి పథకాలను పొదుపుగా వాడుకోవాల్సి ఉంది. గత వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలకు ఇంకా కొన్నిచోట్ల చెరువుల్లో నీరు లభిస్తోంది. జిల్లా సగటు భూగర్భ జలాలు గతేడాది 7.33 మీటర్లుగా ఉండగా, ఈ ఏడాది 6.85 మీటర్లుగా ఉంది.
పట్టణాల్లో విచ్చలవిడిగా..
పట్టణాల్లో విచ్చలవిడిగా బోర్లు వేయడంతో చాలాచోట్ల భూ గర్భజలాలు ఏటేటా లోతులోకి పడిపోతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు మండల కేంద్రాల్లో గృహావసరాలకు వినియోగిస్తున్న బోర్లు పరిమితి లేకుండా వేస్తున్నారు. వ్యాపార అవసరాల కోసం కొన్ని కాలనీల్లో వెయ్యి ఫీట్లకు పైనే బోర్లు వేస్తుండడం గమనార్హం. పలువురు వ్యాపారులు చాలాచోట్ల అనుమతులు లేకుండానే మినరల్ ప్లాంట్లు, నీటి శుద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే నీటి వాడకంపై వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు నీటి మీటర్లు బిగించుకోవాలని ఆ మేరకు పన్ను చెల్లించాలని ఆదేశాలున్నప్పటికీ చాలా చోట్ల అమలు కావడం లేదు. అధికారులు నోటీసులిస్తున్నా పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కావడంలేదు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడుతున్న పలు వ్యాపార, వాణిజ్య సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
‘ఎల్లంపల్లి’లోనూ ఎక్కువగానే..
గోదావరి పైనున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోనూ నీటి నిల్వలకు ప్రస్తుతం ఢోకా లేదు. గతేడాదికి ఇదే సమయానికి పోలిస్తే మెరుగ్గానే నీటి నిల్వలున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు వానాకాలం నుంచే నీటి నిల్వలను ముందు జాగ్రత్తగా డ్యాంలో నిల్వ చేస్తూ వచ్చారు. వేసవిలో ప్రస్తుతం రోజువారీ అవసరాలకు అనుగుణంగా మిషన్ భగీరథ తాగునీటి పథకం కింద మంచిర్యాల, రామగుండం ప్రాంతాలకు 23 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా పథకానికి 310 క్యూసెక్కులు, వేమ్నూరు పంపుహౌస్ నుంచి 247 క్యూసెక్కులు వదులుతున్నారు. అయితే, వేసవిలోనూ ప్రాజెక్ట్‌కు ఇనోఫ్లో ఉంది. ప్రస్తుతం కడెం పరీవాహక ప్రాంతాల నుంచి 1,073 క్యూసెక్కుల వరద ఉంది. అంతే మొత్తంలో అధికారులు అవుట్‌ఫ్లో విడుదల చేస్తున్నారు.
జిల్లాలో గతేడాది, ఈ ఏడాది ఏప్రిల్‌లో భూగర్భ జలాలు (మీటర్లలో)
మండలం గ్రామం గతేడాది ప్రస్తుతం
బెల్లంపల్లి బెల్లంపల్లి 15.39 13.94
భీమిని రాంపూర్ 2.66 2.55
చెన్నూరు చెన్నూరు 7.62 7.32
చెన్నూరు కొమ్మెర 2.08 1.91
దండేపల్లి మ్యాదిరిపేట 5.01 4.44
హాజీపూర్ హాజీపూర్ 5.06 4.32
జైపూర్ జైపూర్ 4.05 5.10
జైపూర్ కుందారం 19.81 19.55
జన్నారం ఇందన్‌పల్లి 5.24 4.74
కన్నెపల్లి జన్కాపూర్ 0.01 0.01
కాసిపేట కొండాపూర్ 3.72 3.83
కోటపల్లి కోటపల్లి 18.24 19.45
లక్సెట్టిపేట లక్సెట్టిపేట 2.26 4.31
మందమర్రి మందమర్రి 4.90 5.22
మందమర్రి పొన్నారం 14.05 11.09
నెన్నెల నెన్నెల 6.03 4.36
తాండూరు తాండూరు 15.70 12.52
వేమనపల్లి నీల్వాయి 0.55 0.45
జన్నారం జన్నారం 6.63 6.39
జన్నారం తపాలాపూర్ 3.93 2.69
భీమారం భీమారం 9.13 8.46
మంచిర్యాల మంచిర్యాల 7.64 7.30
నస్పూర్ నస్పూర్ 11.96 10.80
వేమనపల్లి లక్ష్మీపూర్ 4.55 4.42
కన్నెపల్లి నాయకిన్‌పేట 7.12 6.16
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్థితి (మంగళవారం నాటికి)
పూర్తి నీటిమట్టం 148మీటర్లు
ప్రస్తుతం 143.18 మీటర్లు
సామర్థ్యం 20.1754 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ 9.2564 టీఎంసీలు
గతేడాది ఇదేరోజు నీటిమట్టం 142.64 మీటర్లు
నిల్వ 8.3957 టీఎంసీలు


