మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ఈ నెల 4నుంచి అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తోంది. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి హాజ రయ్యేందుకు జిల్లా నలుమూలల నుంచి వస్తూ బాధితులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి స్వీకరించిన వినతులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)లో అప్‌లోడ్ చేసి, యూనిక్ రిఫరెన్స్ నంబర్‌తో కూడిన రశీదు ఇస్తున్నారు. ఈ రశీదు ద్వారా దరఖాస్తుదారు తన అర్జీ ఏ స్థితిలో ఉందో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం గరిష్టంగా 30రోజుల్లోపు వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలను పోర్టల్‌లో ఉంచాల్సి ఉంది. ఒకవేళ నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపకపోతే, ఆ కేసులు ఆటోమేటిక్‌గా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోకి వెళ్తాయి. అప్పుడు ఉన్నతాధికారులకు కిందిస్థాయి అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
అధికారుల హాజరు తప్పనిసరి
ప్రతీ సోమవారం మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ నెల 4న మొదటిసారి మంచిర్యాల ఆర్డీవో కా ర్యాలయంలో కార్యక్రమం చేపట్టగా, బెల్లంపల్లిలో ని సబ్ కలెక్టర్ (ఆర్డీవో) కార్యాలయంలో కాకుండా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. మంచిర్యాలలో నాలుగు, బెల్లంపల్లిలో 34 అర్జీలు అందాయి. కార్యక్రమానికి నోడల్ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తుండగా, అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. డీఎల్పీవో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్, డిస్కం డీఈ, ఆర్‌అండ్‌బీ డీఈఈ, సీడీపీవో తదితర అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది.
తగ్గనున్న దూరభారం
కలెక్టరేట్‌కు వెళ్లాల్సిన పని లేకుండా రెవెన్యూ డివిజ న్ కార్యాలయాల్లోనే బాధితులు సమస్యలు విన్నవించుకునే అవకాశముంది. దీంతో వారికి దూరభా రం తగ్గడంతోపాటు 30 రోజుల్లోనే సమస్యకు పరి ష్కారం దొరకనుంది. మంచిర్యాల ఆర్డీవో కార్యాల యం బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో నే ఉండగా డివిజన్ వ్యాప్తంగా వచ్చే బాధితులకు ఇది ఎంతో సౌకర్యవంతం. మొదటిసారి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో అంతగా స్పందన రానట్లు తెలిసింది. దీనిపై ప్రజలకు అవగాహ న కల్పించాల్సిన అవసరముంది. కాగా, కొద్ది రోజు ల్లోనే మండలాల్లోనూ ప్రజావాణి నిర్వహించేందు కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


