ఆధునికంగా ముందుకు‘సాగు’తేనే.. | - | Sakshi
Sakshi News home page

ఆధునికంగా ముందుకు‘సాగు’తేనే..

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

● తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ● జిల్లాలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ ● 56 గ్రామాల్లో అవగాహన సదస్సులు

దండేపల్లి: రైతులను వానాకాలం సాగుకు సిద్ధంచేయాలని భావిస్తున్న ప్రభుత్వం వారికి ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది. గత నెల27న ప్రారంభించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కా ర్యక్రమాన్ని ఈనెల 23 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనుంది. జిల్లాలోని 56 గ్రామాల్లో ఈసదస్సులు నిర్వహించనుండగా ఇందుకు ఏడు బృందాల ను నియమించింది. జిల్లాలో ఇప్పటివరకు 16 గ్రా మాల్లో సదస్సులు నిర్వహించింది. మిగతా గ్రామాల్లో గడువులోపు కార్యక్రమాలు నిర్వహించి రైతులను వానాకాలం సాగుకు సన్నద్ధం చేయనుంది.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే..

రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు రైతులకు సాగులో పాటించే పలు అంశాలపై సూచనలు చేస్తున్నారు. అనవసరంగా యూరియా వాడకాన్ని తగ్గించి, నేల స్వభావాన్ని బట్టి ఎరువులు ఎలా వేయాలో వివరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించేందుకు అవసరమైన మెళకువలు నేర్పిస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వరి విత్తనాలు సాగు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. వరి మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. సాగునీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలో తెలియజేస్తున్నారు. సాగు విషయాల్లో రైతులను అప్రమత్తం చేయడం, వారి సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.

సద్వినియోగం చేసుకోవాలి

సాగులో పాటించాల్సిన నూతన పద్ధతుల గురించి వివరించేందుకు కేవీకే శాస్త్రవేత్తలు రైతుల వద్దకే వచ్చి సదస్సులు నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు చెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాగులో ఆచరించి మంచి దిగుబడులు సాధించాలి. సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.

– సురేఖ, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
 
Advertisement
Advertisement