చెన్నూర్: వేసవి సెలవుల్లో ప్రజ్ఞ శిక్షణ తరగతులు చిన్నారులకు వరంగా మారాయి. స్థానిక రాధాకృష్ణ మందిర్‌లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజ్ఞ వేసవి శిక్షణ శిబిరంలో ఐదు నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు మేధస్సు, ఆరోగ్యంపై శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ పాటవాలు వెలికితీసేందుకు శిక్షణ తరగతులు దోహదం చేస్తాయని శిక్షకులు పేర్కొన్నారు. నెల రోజులపాటు ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని, శిక్షణలో యోగా, మెడిటేషన్, భక్తి గీతాలు, ఫజిల్స్, తదితర కార్యక్రమాలు ఉంటాయని వికాస తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ భీమిని రవీందర్‌గౌడ్, పబ్లిక్ కోఆర్డినేటర్ కట్ల శ్రీనివాసాచార్యులు, సభ్యులు కాసుల సుధీర్, నడిపల్లి లక్ష్మణ్‌రావు, లక్ష్మాగౌడ్ తెలిపారు.


