బాసర: ఆర్జీయూకేటీ విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్జీయూకేటీని సందర్శించి విశ్వవిద్యాలయ అధికారులతో కలెక్టర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో ఆధునిక సులభతర పద్ధతులను ప్రవేశపెట్టాలన్నారు. క్లిష్టమైన అంశాలు కూడా సులువుగా అర్థమయ్యేలా బోధించాలన్నారు. కేవలం పట్టభద్రులుగా కాకుండా ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న రంగాల వైపు విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రాను, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్‌ను వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, తహసీల్దార్ పవన్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.


