ఆసిఫాబాద్‌రూరల్/సిర్పూర్(టి): పార్కింగ్ సమస్యకు విన్నూత పరిష్కారం చూపించే విధంగా పార్కింగ్ మేనేజ్మెంట్ ఇన్ క్రౌడెంట్ ప్లెస్ అనే డిజైన్‌కు ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నుంచి అధికారిక నమోదు లభించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం డిజైన్ తయారు చేసిన సిర్పూర్(టి) మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన విద్యార్థి మమత, గైడ్ టీచర్ కేశవ్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్‌ను డీఈవో లలితతో కలిసి కలెక్టరేట్‌లో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026, జనవరి 5న డిజైన్ నమోదు చేయడం జరిగిందని, ప్రస్తుతం నగరాలలో పెరుగుతున్న ట్రాఫిక్, ప్కారింగ్ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందించే దిశగా ఒకఅడుగు పడినట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ నిర్వహణకు సులభతరం చేయడంలో ఈ డిజైన్ ఉపయోగపడుతుందన్నారు. జిల్లా విద్యార్థులకు, యువతకు ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు.


