స్కూటీ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూటీ ఢీకొని వ్యక్తి మృతి

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

కాసిపేట: స్కూటీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన గొడిసెల మల్లేశ్‌ (65) సోమవారం తనకు పరిచయస్తుడైన లింగంపల్లి శంకర్‌తో కలిసి బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి పెద్దనపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా మల్బార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సమీపంలో వెనుక నుంచి స్కూటీపై వచ్చిన సయ్యద్‌ హబీద్‌ అతివేగంగా వచ్చి మల్లేశ్‌ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుమార్తె గొడిసెల వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు..

దిలావర్‌పూర్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నిర్మల్‌ పట్టణంలోని సోఫీనగర్‌కు చెందిన దండుగుల పవన్‌ (26) సెంట్రింగ్‌ పనులు చేస్తుండేవాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని తన పల్స ర్‌ బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కాల్వ గ్రామ సమీపంలోకి రాగానే బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రవీందర్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధం

తలమడుగు: మండలంలోని ఉండం గ్రామంలో సోమవారం సాయంత్రం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో జొన్నపంట దగ్ధమైంది. రైతులు దార్ల శ్రీకాంత్‌కు చెందిన మూడెరాలు, వంశీకి చెందిన రెండెకరాలు, శివయ్యకు చెందిన రెండెకరాల్లో జొన్నపంట దగ్ధమైంది. ఘటనలో విద్యుత్‌ మోటార్‌, 100 పైపులు, 25 స్పింక్లరు, వ్యవసాయ సామగ్రి దగ్ధమయ్యాయి. ఘటనలో సుమారు రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

మన్నూర్‌లో జొన్న, మొక్కజొన్న..

గుడిహత్నూర్‌: మండలంలోని మన్నూర్‌లో రైతు వెంకట్రావ్‌కు చెందిన రెండు ఎకరాల్లో జొన్న, రెండు ఎకరాల్లో మొక్క జొన్న పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు రోజుల్లో క్రషర్‌ పట్టించాల్సి ఉండగా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. గ్రామస్తులు ఫైరింజన్‌కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చేసరికే పంట పూర్తి స్థాయిలో కాలిబూడిదైంది. సుమారు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement