ఇంద్రవెల్లి: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం హీరాపూర్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు ఆవాస గ్రామాలకు రూ.25 లక్షలతో తాగునీటి సౌకర్యానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు మేరకు భూ సమస్య పరిష్కరించడానికి అటవీ హక్కు పట్టాలు, రెవెన్యూ పట్టాల సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఐటీడీఏ పీవో మందా మకరందు మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ హీరాపూర్‌లో త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు తెలిపారు. 2021 ఏప్రిల్ 20న హీరాపూర్‌ను సందర్శించిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనున్నట్లు పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కానున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికే హీరాపూర్‌లో ప్రజావాణి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజావాణిలో గ్రామ పెద్దలు, నాయకుల అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ రాథోడ్ రవీందర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ జే.చావన్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, సర్పంచులు తొడసం లక్ష్మీనాగోరావ్, ఆత్రం మహేశ్వర్, రాథోడ్ రోహిదాస్, పంచాయతీరాజ్ డీఈ పవార్ రమేశ్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో జీవన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


