బోథ్: మండలంలోని కన్గుట్టలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న, జొన్న పంటలు దగ్ధమైన బాధిత రైతులకు పరిహారం అందేలా చూస్తామని తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌తో కలిసి గ్రామాన్ని సందర్శించి దగ్ధమైన పంటలు పరిశీలించారు. బాధిత రైతులు అధైర్య పడవద్దని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు భరోసా కల్పించేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్‌ఖాన్, నిర్మల్ కాంగ్రెస్ నాయకుడు మల్లారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బూరుగుల మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి
నేరడిగొండ: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చట్టబద్ధత కల్పించాలని టీఎస్‌ఎస్‌డీసీ టీఎస్‌డీసీ చైర్మన్ అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందని విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ‘కిసాన్ కపాస్’ యాప్ పేరుతో పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, నాయకులు సద్దాం, సీతారాం, తదితరులు పాల్గొన్నారు.


