ఉట్నూర్‌రూరల్: ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలో గిరిజన నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 3 వెంటనే పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ ప్రాంత యువతకు సముచిత వాటా కల్పించాలని, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 15 ఏళ్లుగా నోటిఫికేషన్లు లేక వేలాది మంది యువత వయసు భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో మడావి నగేష్, తిరుపతి, రాథోడ్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


