కథలు చెప్పం.. రాస్తాం..! | - | Sakshi
Sakshi News home page

కథలు చెప్పం.. రాస్తాం..!

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

● విద్యార్థులు కలం నుంచి ‘వన్‌డే–వన్‌ స్టోరీ’ ● సెలవుల్లో కొత్త కోణంపై దృష్టి

నీతికథలు రాస్తున్నా..

నాకు కథలంటే చాలా ఇష్టం. హెచ్‌ఎం, ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో కథలు, కవితలు రాస్తున్నాను. కథల కోసం ఒక నోట్‌ బుక్‌ పెట్టాను. ఇంటి వద్ద హోంవర్క్‌ పూర్తయ్యాక రోజుకో కథ రాస్తున్నాను. ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ కథలు రాస్తున్నాను. భాషపై పట్టు పెరగడంతోపాటు రైటింగ్‌ మెరుగుపడుతుంది.

– ఉషశ్రీ, 5వ తరగతి

దండేపల్లి: అక్షరాలు దిద్దాల్సిన వయసులోనే చిన్నారులు చిట్టి చేతులతో నీతి కథలు రాస్తున్నారు. వేసవి సెలవుల్లో కొత్త కోణంలో కథలు రాయడంపై దృష్టి సారించారు. మండలంలోని ద్వారక ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు ఉన్నారు. 3, 4, 5వ తరగతుల విద్యార్థుల ప్రధానోపాధ్యాయుడు సురేష్‌, ఉపాధ్యాయురాలు లావణ్య ‘వన్‌డే–వన్‌స్టోరీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పర్యావరణం, స్నేహం, నిజాయతీ, జంతువులు వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని తెలుగు, ఆంగ్లంలో రోజుకో కథ రాస్తున్నారు. దీంతో వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతోపాటు విద్యార్థులే స్వయంగా రాయడంతో వారిలో నైతిక విలువలు పెంపొందుతాయి. పుస్తకాలతో కుస్తీ పట్టడమే కష్టమనుకునే ఈ రోజుల్లో సొంతగా నీతికథలు రాస్తూ రచయితలుగా రాణిస్తున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో ఇంటి వద్ద పుస్తక పఠనం చేస్తూ భాషాభివృద్ధిని పెంపొందించుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు.

మరిన్ని కథలు రాస్తాను..

నేను ఏడాది నుంచి కథలు రాస్తున్నాను. ఈఏటితో నేను ఈ పాఠశాలలో చదువు పూర్తయినప్పటికీ పై తరగతులకు వెళ్లిన కూడా నేను నా రచన అలవాటును కొనసాగిస్తాను. మరింత అభివృద్ధి చేసుకుంటూ మరిన్ని కథలు రాస్తాను. ఇది నాకు మంచి అలవాటుగా అనిపిస్తుంది. – నిత్య, 5వతరగతి

సృజనాత్మకతను వెలికితీయాలని..

ప్రతీ విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలనే ఆలోచన, రచనలపై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశ్యంతో వన్‌డే–వన్‌స్టోరీ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాను. విద్యార్థులు చాలా ఆసక్తి కనబరుస్తూ పోటీపడి కథలు రాస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో భావగ్రహణ శక్తితోపాటు ఆలోచన శక్తి పెరుగుతుంది.

– నీరటి సురేష్‌, పాఠశాల హెచ్‌ఎం

Advertisement
 
Advertisement
Advertisement