రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్‌లో ఓపెన్‌కాస్ట్ ఫేజ్–2 ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓసీ ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు పరోక్షంగా ఉపాధి మార్గాలు ఏర్పడుతాయని భావించిన ప్రజల ఆశలపై అటవీశాఖ ప్రతిబంధకాలు నీళ్లు చల్లుతున్నాయి. ఓసీ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండడంతో ప్రారంభమవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మందమర్రి ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ ఫేజ్–2 ప్రాజెక్టుకు 366 హెక్టార్ల భూమి క్లియరెన్స్ ప్రస్తుతం ప్రధాన అడ్డంకిగా మారింది. గతంలో ఇదే భూమిని ‘నాన్ ఫారెస్ట్ ల్యాండ్’గా గుర్తించి క్లియరెన్స్ ఇచ్చిన అటవీ అధికారులు ఇప్పుడే అదే భూమిని ‘ఫారెస్ట్ ల్యాండ్’గా పేర్కొనడం వివాదానికి దారి తీస్తోంది. దీంతో ఓసీ ఫేజ్–2 ప్రారంభంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. మూతపడిన ఆర్కే 3, 4, 1ఏ గనులను ఉపయోగిస్తూ ఓసీ ఫేజ్–2 ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసింది. ఫేజ్–1లో భాగంగా ఎంకే–4, 4ఏ గనుల ద్వారా దాదాపు పదేళ్లపాటు బొగ్గు తవ్వకాలు జరిపిన యాజమాన్యం ప్రస్తుతం ఫేజ్–2లో సుమారు 30 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీత చేపట్టాలని, దాదాపు 18ఏళ్లపాటు బొగ్గు తీయాలనే లక్ష్యంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంకల్పించింది. గత డిసెంబర్ 3న ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయని స్థానికులు ఆశిస్తున్న తరుణంలో అటవీ శాఖ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. గతంలో ఫేజ్–1 సమయంలో ఇదే 366 హెక్టార్ల భూమిని ‘నాన్ ఫారెస్ట్ ల్యాండ్’గా గుర్తిస్తూ అటవీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని ఫారెస్ట్ ల్యాండ్‌గా పేర్కొంటూ ఫేజ్–2కు అభ్యంతరాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఫేజ్–2 మొత్తం 1206 హెక్టార్లలో ఏర్పాటు కావాల్సి ఉండగా ప్రస్తుత వివాదం ఆ భూమిపైకి మళ్లింది.
ఆన్‌లైన్ పేరిట
కొత్త చిక్కులు..
గతంలో 1917 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం నాన్ ఫారెస్ట్ ల్యాండ్ కింద ఈ భూమికి క్లియరెన్స్ ఇచ్చిన అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ఆన్‌లైన్ విధానం అమల్లోకి రావడం, ‘పరివేష్’ అనే సాఫ్ట్‌వేర్‌లో నమోదైన వివరాలు కూడా కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయని సమాచారం. మ్యాపింగ్ ప్రకారం ఇది నాన్ ఫారెస్ట్ ల్యాండ్‌గా స్పష్టత ఉన్నా కొందరు అధికారుల అభ్యంతరాలు ప్రాజెక్టు ఏర్పాటుకు అవరోధంగా మారుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే భూమికి సంబంధించి కొందరు అటవీ అధికారులు గతంలో ఒక విధంగా ఇప్పుడు మరో విధంగా మాట్లాడడంపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫేజ్–1కు క్లియరెన్స్ ఇచ్చిన భూమికే ఇప్పుడు అడ్డంకులు ఎందుకు అన్న ప్రశ్నలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అటవీ అధికారులతో ఇదివరకే చర్చించినట్లు సమాచారం. కలెక్టర్ స్థాయిలోనూ సంప్రదింపులు జరిపినా పరిష్కారం లేకపోవడం గమనార్హం. అటవీశాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో స్థానిక ఎంపీ కూడా కేంద్ర స్థాయిలో చొరవ చూపి క్లియరెన్స్ సాధించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మంత్రి జోక్యం చేసుకున్నా
కానరాని ఫలితం..


