జిల్లాలో
అంగన్‌వాడీ కేంద్రాలు 974
చిన్నారులు 40,794 గర్భిణులు 3,307
బాలింతలు 3,543
మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 1నుంచి 31వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండ వేడి తీవ్రంగా మారుతుండడం, వడగాల్పులు వీస్తుండడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో మే నెలకు సంబంధించిన పౌష్టికాహారం నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పోషక విలువలు కలిగిన ఆహారంతోపాటు గుడ్లు, అంగన్‌వాడీ సరుకులను టీహెచ్‌ఆర్(టేక్ హౌజ్ రేషన్) ఇవ్వాలని నిర్ణయించి అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కల్పించి సూచనలు చేసింది.
నెలరోజులకు ఒకేసారి
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతీరోజు ఉడకబెట్టిన కోడిగుడ్డు, అన్నం, రోజుకో రకంగా కూరగాయలు, పప్పుతో మధ్యాహ్నం భోజనాన్ని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వడ్డిస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో మధ్యాహ్నం భోజనం లబ్ధిదారులకు అందించడం వీలు కాదు. దీంతో నెలకు సరిప డా సరుకులను ఒకేసారి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారులకు 30 గుడ్లు, 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్ల లకు 16 గుడ్లు, ఆరు లీటర్ల పాలు, 25 రోజులకు సరిపడా రోజుకు 16 గ్రాముల చొప్పున మంచి నూనె, 30 గ్రాముల చొప్పున కందిపప్పు, సరిపడా బియ్యం వంటివి నేరుగా అందిస్తారు. ఇంటికే పంపించే పౌష్టికాహారం తప్పనిసరిగా లబ్ధిదారులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


