కార్మిక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

కార్మిక సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● కలెక్టరేట్‌లో మే డే వేడుకలు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మే డే వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, నగరపాలక మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ దుర్గం క్రాంతితోపాటు పాల్గొన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ప్రమాదరీత్యా మరణించిన 102 కార్మికుల కుటుంబాలకు సుమారు రూ.60 కోట్లు, సహజ మరణం పొందిన 223 కార్మికుల కుటుంబాలకు రూ.24 కోట్లు, పెళ్లి ప్రోత్సాహం కింద 993 మందికి రూ.30 కోట్లు, ప్రసూతి ప్రోత్సాహం కింద 1,646 మందికి రూ.49 కోట్లు, వైకల్యం పొందిన వారికి రూ.68 కోట్లు అందజేశామని వివరించారు. మే 2 నుంచి 10 వరకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో త్వరలో ఈఎస్‌ఐ ఆస్పత్రి మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. అసంఘటిత కార్మికులు మరణిస్తే కుటుంబానికి ఇచ్చే నగదును రూ.15 లక్షలకు పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం కార్మిక శాఖకు చెందిన బి.సత్యనారాయణ, ఉపాధి కల్పన కింద వై.రమేష్‌(ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌), ఉత్తమ ఎస్టాబ్లిష్మింట్‌ కింద ఓరియంట్‌ సిమెంట్‌ దేవాపూర్‌, ప్రత్యేక కేటగిరి(బాలకార్మిక) కింద శివాజీ(7వ తరగతి విద్యార్థి జెడ్పీహెచ్‌ఎస్‌ టేకులబస్తి బెల్లంపల్లి)లకు అవార్డులు అందజేశారు. 16 మండలాలకు కంప్యూటర్లను అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement