క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

మంచిర్యాలటౌన్‌/జన్నారం: వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఉచితంగా వేస్తున్నారని వ్యాక్సినేషన్‌ రాష్ట్ర పరిశీలకుడు డేవిడ్‌ దామర్‌ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జన్నారం, దండేపల్లి మండలం వెంకట్రావ్‌పేట్‌, పాత మంచిర్యాల ప్రాథమిక అర్బన్‌ హెల్త్‌ కేంద్రం, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, ఎన్టీఆర్‌ నగర్‌ ఉపకేంద్రంలో హెచ్‌వీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. బాలికలకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అని, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ నివారణకు దోహదపడుతుందని తెలిపారు. వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని, వంద శాతం వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీపీహెచ్‌ఎన్‌ ఆర్‌ఎస్‌ పద్మ, మార్త శ్రీనివాస్‌, అఖిల్‌ పాషా, డెమో బుక్క వెంకటేశ్వర్‌, జన్నారం వైద్యాధికారి ఉమాశ్రీ పాల్గొన్నారు.

కిష్టాపూర్‌ బీట్‌ అధికారి సస్పెన్షన్‌

జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌ కిష్టాపూర్‌ బీట్‌ అధికారి పరమేశ్వర్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా అటవీ అధికారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడవిలో మంటలు ఆర్పడంలో, విధుల్లో నిర్లక్ష్యం, వహించినందుకు సస్పెండ్‌ చేసినట్లు జన్నారం రేంజ్‌ అధికారి లక్ష్మినారాయణ తెలిపారు.

తాండూర్‌ ఏపీవో..

తాండూర్‌: మండల ఏపీవో ఎస్‌.నందకుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఆర్‌డీఏ ఎస్‌.కిషన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఏపీవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మద్యంమత్తులో విధులు నిర్వహిస్తూ, ఇతర ఉద్యోగులు, ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఎంపీడీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ జె.సత్యనారాయణను ఇంచార్జి ఏపీవోగా నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement