ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీలోగల ఓ మసీద్ సమీపంలో నిలిపిన ఐదు ద్విచక్ర వాహనాల నుంచి ఇటీవల ఒక్కసారిగా మంటలు లేచాయి. క్షణాల్లో వాహనాలు అగ్నికి ఆహూతయ్యాయి. దీంతో బాధితులు తీవ్రంగా నష్టపోయారు.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం స్టాండ్ సమీపంలో ఇటీవల ఒకరు బైక్ పార్క్ చేసి సరుకుల కోసం వెళ్లాడు. ఇంతలో బ్యాటరీలోంచి మంటలు చెలరేగాయి. స్థానికులు తడి గోనె సంచులు, మట్టిపోసి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది.
ఆదిలాబాద్ టౌన్: ఉమ్మడి జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండవేడిమికి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని వాహనాలు ఆహూతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నా రు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్లు, బైకులు వే డెక్కడం, వాటి నుంచి పొగ రావడం, టైర్లు పేలిపోవడంతో పాటు మంటలు చెలరేగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ఇంజిన్ ఓవర్ హీటే కారణం
వేసవిలో వాహనాల ఇంజిన్ ఓవర్ హీట్ కారణంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీర్ఘకాలంగా వాహనాన్ని నడపడం, ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించడంతో ఇంజిన్ వేడెక్కి వైర్లు, పైపులు దెబ్బతింటాయి. దీని కారణంగా మంటలు వ్యాపించే ప్రమాదముంది. వాహనం బయటకు తీసే ముందు ఇంజిన్ ఆయిల్ స్థాయిని తప్పనిసరి గా పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ యిల్ తక్కువగా ఉంటే ఇంజిన్ మరింత వేడెక్కే అ వకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే, ఇంజిన్ కూలింగ్ వ్యవస్థ సరిగా ఉండాలి. వేసవిలో రేడియేటర్లలో దుమ్ము చేరి కూలెంట్ సరిగా పనిచేయకపోవడంతో ఇంజిన్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. రేడియేటర్‌ను తరచూ శుభ్రం చేయించాలి. కూలెంట్‌ను నిత్యం పరిశీలించాలి. టైర్ల పరిస్థితిని ఎప్ప టికప్పుడు గమనిస్తూ ఉండాలి. టైర్లు అరిగిపోయినా, సరైన గాలి లేకపోయినా, ఎక్కువ గాలి ఉన్నా అవి పేలిపోయే ప్రమాదముంది.
వేసవి కాలంలో వాహనదారులు వాహనాల్లో పెట్రోల్ లేదా డీజిల్‌ను ఫుల్‌ట్యాంక్ చేయించవద్దు. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వాహనంలో మంటలు వ్యాపించే ప్రమాదముంది. అధిక వేడి కారణంగా ట్యాంక్‌లో ఒత్తిడి పెరిగి ప్రమాదాలకు దారితీయవచ్చు. అవసరమైనంత మాత్రమే వాహనంలో ఇంధనం ఉంచుకోవడం మంచిదని మెకానిక్‌లు సూచిస్తున్నారు. బ్యాట రీలకు అదనపు లైట్లు, నాణ్యతలేని వైర్లు అమర్చినా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశముంటుందని చెబుతున్నారు. అనవసర మార్పులు చేయించకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. వాహనాన్ని సాధ్యమైనంత వరకు నీడలో నిలుపాలని పేర్కొన్నారు. చిన్న సమస్య వచ్చినా వెంటనే మెకానిక్‌ను సంప్రదించాలని సూచించారు.


