ఇంటర్‌లో ఫెయిలై విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఫెయిలై విద్యార్థిని ఆత్మహత్య

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

లక్సెట్టిపేట: మండలంలోని చందారం గ్రామానికి చెందిన మాధవి (17) అనే ఇంటర్‌ విద్యార్థిని ఇంటర్‌లో ఫెయిలై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మాధవి తన అక్క, అమ్మమ్మతో కలిసి చందారం గ్రామంలో ఉంటోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో గ్రామస్తుల సహకారంతో స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన వార్షిక పరీక్షల ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైంది. అప్పటి నుంచి బాధపడుతోంది. శుక్రవారం ఉదయం తన అక్క హైదరాబాద్‌కు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అక్క అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

వాంకిడి: మండల కేంద్రంలోని శివకేశవ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శివకేశవ్‌నగర్‌కు చెందిన కోదండ సాయి (23) రాత్రి ఖమాన గ్రామానికి వెళ్లాడు. తిరిగి ఖమాన గ్రామం వైపు నుంచి వాంకిడి వైపునకు వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

యువకుడి అనుమానాస్పద మృతి

లక్సెట్టిపేట: లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన అశోక్‌ (36) అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానిక ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అవివాహితుడైన అశోక్‌ చేపలు పట్టుకుని జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం సాయంత్రం చేపలు పట్టేందుకు తిమ్మాపూర్‌ గ్రామానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం తిమ్మాపూర్‌, ఇటిక్యాల గ్రామాల మధ్య అతడి మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి కొద్ది దూరంలో అతడి ద్విచక్రవాహనం పడి ఉంది. మృతుడి తల్లి మల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement