సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గోదావరినదిపై వంతెన నిర్మాణానికి అడుగు ముందుకు పడడం లేదు. పెరుగుతున్న ట్రాఫిక్, దూరభార సమస్యలు తీర్చేందుకు నదిపై మరో హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వంతెన పోరు పేరుతో ఐబీ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. గతంలోనూ ఈ తరహా నిరసనలు వ్యక్తం చేశారు. 2018 ఫిబ్రవరిలో అప్పటి సీఎం కేసీఆర్ మంచిర్యాల పర్యటనలో గోదావరి నదిపై మంచిర్యాల–అంతర్గాం కలిపేలా బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. ఈ మేరకు రూ.125 కోట్లతో హైలెవల్ బ్రిడ్జికి నిధులు అవసరమని రోడ్లు భవనాల శాఖ అంచనా వేసింది. ఇందుకు జీవో సైతం విడుదల చేశారు. ‘ప్లాన్ ఫర్ వర్క్’ స్కీంలో నిధులు మంజూరయ్యాయి. అయితే నాలుగేళ్లపాటు టెండర్లు వేయడంలోనే జాప్యం జరిగింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికుల వినతులతో చివరికి 2022లో రూ.108కోట్ల అంచనాతో టెండర్లు పిలిస్తే ముందుకు రాలేదు. చివరికి సవరించిన అంచనాలతో మరోసారి టెండర్లు పిలువగా రూ.164 కోట్లకు వల్లభనేని సంస్థ టెండరు దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వంతెన నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. నేల స్వభావం, పిల్లర్లు, బరువు, ఇతర టెస్టింగ్ పనులు జరిగాయి. ఎన్నికలు రావడంతో నిలిచిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో కొన్నాళ్లపాటు మరుగున పడింది.
ప్రత్యామ్నాయ వంతెనలోనూ..
జిల్లా కేంద్రం గుండా భారీ వాహనాల రాకపోకలతోపాటు ఐబీ చౌరస్తా, మార్కెట్ రోడ్డుకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిని రద్దు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు ప్రకటించారు. ఆ తర్వాత అందుకు ప్రత్యామ్నాయంగా మరోచోట హాజీపూర్ మండలం ముల్కల్ల అటు వైపు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్‌ను కలుపుతూ నిర్మించాలని ప్రతిపాదనలు తెచ్చారు. దీని నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖ నుంచి ఇంజినీర్లు ఈ ప్రాంతంలో ప్రాథమికంగా సర్వే చేశారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణంతో కొత్తగా రోడ్డు నిర్మిస్తున్న జాతీయ రహదారి–63కు కలపడమే కాక, నగర శివారులో ఉండడంతో భారీ వాహనాలు, ట్రాఫిక్ బయట నుంచే వెళ్లే అవకాశం ఉంది. అయితే జిల్లా కేంద్రంలో నిర్మించే బ్రిడ్జితో పోలిస్తే నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కొత్తగా బ్రిడ్జి నిర్మించాలంటే రూ.450కోట్లు ఖర్చు చే యాల్సి ఉంది. అంతేగాక భూ సేకరణ పెరగడంతోనూ వ్యయం పెరుగుతుంది. ఈ క్రమంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వం నుంచి ఇంకా పరిపాలన అనుమతులు రాలేదు.
రోడ్డు రవాణా మెరుగు
గోదావరిపై ప్రస్తుతమున్న జైపూర్ మండలం ఇందారం–గోదావరిఖని వంతెనపై ట్రాఫిక్ పెరుగుతోంది. గోదావరిఖని మీదుగా వెళ్లాంటే ట్రాఫిక్‌తో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సమయం, దూరభారం పెరుగుతోంది. కోల్‌బెల్ట్ కారిడార్‌గా ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు రవాణా త్వరితగతిన వెళ్లవచ్చు. జిల్లా కేంద్రం మీదుగా నిర్మించే వంతెనతో గోదావరిఖని, ఎన్టీపీసీకి వెళ్లకుండా నేరుగా అంతర్గాం మీదుగా బసంత్‌నగర్‌కు దూరభారం సుమారు 18కిలోమీటర్లు తగ్గేది. ఇక ముల్కల్ల–ముర్మూర్ మధ్య నిర్మిస్తే సుమారు 5కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ రెండింటిలోనూ ఏ వంతెనపైనా ప్రతిపాదన పూర్తిస్థాయిలో నిర్మాణానికి అడుగు ముందుకు పడకపోవడంతో గోదావరిపై హెలెవల్ వంతెనకు ఇంకా ఎన్నాళ్లు పడుతుందోనని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.


