ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్(గ్రేడ్–2)ల నియామక ప్రక్రియ సోమవారం పూర్తయ్యింది. గతేడాది నవంబర్‌లో మెడికల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ ల్యాబ్ టెక్నీషియన్ల నియామకానికి ప్రభుత్వం రాతపరీక్ష నిర్వహించింది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు రాతపరీక్షలో 20 మార్కుల వెయిటేజీ ఇచ్చారు. దీంతో జిల్లాకు 67 మంది ల్యాబ్ టెక్నీషియన్లు నియామకం కాగా, అందులో 60 మంది ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ఉత్తీర్ణత సాధించిన మరో ఏడుగురిని జిల్లాకు కేటాయించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తొమ్మిది మంది, వైద్య విధా న పరిషత్‌లో ఏడుగురు, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి అనుబంధంగా 51 మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలు అందజేశారు. వైద్య ఆరోగ్యశాఖకు ఎంపికై న ల్యాబ్ టెక్నీషియన్లు సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనితకు రిపోర్టు చేశారు. ఈ కార్యక్రమంలో డెమో బుక్క వెంకటేశ్వర్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, టీహబ్ ల్యాబ్ టెక్నీషియన్ రమేశ్ పాల్గొన్నారు.


