ఇంటర్ ఫీజు భారం
పరీక్షల షెడ్యూల్ విడుదల గతం కంటే పెరిగిన పరీక్ష ఫీజులు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు రూ.100 అదనం తగ్గించాలని విద్యార్థుల వేడుకోలు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్షల షె డ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి –మార్చి నెలల్లో రెండు దశల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రూ.100 లేటు ఫీజుతో నవంబర్ 24 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 1వరకు, రూ.1000 ఫైన్‌తో డిసెంబర్ 8 వరకు, రూ.2000 ఫైన్‌తో డిసెంబర్ 15 వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది పరీక్ష ఫీజు పెంపుతో ఒక్కో విద్యార్థిపై రూ.120 అదనపు భారం మోపింది.
గత ఏడాది కంటే ఎక్కువ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థులు మొత్తం 32,343 మందికిపైగా ఉన్నారు. ఫస్టియర్ ఇంటర్ (జనరల్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌తో కలిపి) రూ. 630, వొకేషనల్ –థియరీ, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌తో రూ. 870, సెకండియర్ జనరల్ సైన్స్ రూ.870, జనరల్ ఆర్ట్స్ (ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌తో) రూ. 630 ఫీజు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్‌కు రూ. 520 కాగా 2025 –26 విద్యాసంవత్సరంలో పరీక్షలు రాసే విద్యార్థులకు అదనంగా రూ.10 కలిపి రూ. 530 చెల్లించాలి. గతేడాది నిర్వహించిన ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఫీజు కూ డా జనరల్ ఫీజులోనే (రూ. 520) తీసుకునేవారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో మాత్రం ఇంగ్లిష్ ప్రా క్టికల్ పేరిట రూ. 100 అదనంగా ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. ఈ లెక్కన ఒక్కో విద్యార్థిపై ఇంగ్లిష్ ప్రాక్టికల్ కలిపి రూ.110 అదనపు భారం పడనుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గతేడాది ఫీజు రూ.750 కాగా ప్రస్తుతం రూ.870 చెల్లించాల్సి ఉండటంతో రూ.120 అదనం భారం పడనుంది. ఇక ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్యాలు ఇష్టానుసారంగా రెట్టింపు ఫీజులు వసూలు చేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా కాలేజీలు ఫస్టియర్ సెకండియర్
మంచిర్యాల 65 4699 3528
కుమురంభీం 49 5507 4791
నిర్మల్ 69 7069 6749
జిల్లాల వారీగా ఇంటర్మీడియెట్ విద్యార్థుల వివరాలు..
పెంపు సరికాదు
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు పెంపు సరికాదు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పేరిట రూ.100 ఫీజు వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై ఫీజుల పేరిట అదనపు భారం మోపొద్దు. బ్రిడ్జికోర్సులు చదివే విద్యార్థుల ఫీజులు రూ.200 వరకు పెంచారు. బోర్డు వెంటనే పెంచిన ఫీజులు ఉపసంహరించుకోవాలి.
– చిప్పకుర్తి శ్రీనివాస్,
టీవీయూవీ రాష్ట్ర కార్యదర్శి


