 
															ఎడతెరిపి లేని వాన
చెన్నూర్/చెన్నూర్‌రూరల్/భీమారం/మందమర్రిరూరల్/జైపూర్/భీమిని/బెల్లంపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మోంథా తుపాను ప్రభావం కారణంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పత్తి తడిసి ముద్దవుతోంది. చెన్నూర్‌లోని గోదావరి నదీ తీరం వెంట పత్తి, వరి, మిర్చి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందతున్నారు. చెన్నూర్ మండలం అక్కెపల్లి, చింతలపల్లి, శివలింగాపూర్, భీమారం మండలం అంకుసాపూర్, పోలంపల్లి, మద్దికల్, మందమర్రి, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పంట నేలవాలి నష్టం వాటిల్లింది. మొక్కలపై పత్తి తడిసిపోవడంతో నల్ల గా మారే ప్రమాదం ఉంది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో పెట్టుబడి కూడా రాకుండా పోతుందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డులో నాగమల్ల సోమయ్య ఇంటి పై కప్పు కూలింది.
జిల్లాలో..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 7.7మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మంచిర్యాల మండలంలో 21 మిల్లీమీటర్లు, జైపూర్‌లో 16.5, దండేపల్లిలో 14.5, నస్పూర్‌లో 10.5, కన్నెపల్లిలో 10.5, బెల్లంపల్లిలో 9, హాజీపూర్‌లో 8.8, భీమినిలో 7.5, భీమారంలో 5.8, నెన్నెలలో 5.5, తాండూర్‌లో 5.5, చెన్నూర్‌లో 4.5, మందమర్రిలో 3.5, లక్సెటిపేటలో 3.3, కోటపల్లిలో 1.8, జన్నారంలో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో రెండ్రోజులు తుపాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఓసీపీలో నిలిచిన ఉత్పత్తి
శ్రీరాంపూర్: వర్షం వల్ల శ్రీరాంపూర్ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. బుధవారం మధ్యాహ్నం నుంచి క్వారీలో షవల్స్, డంపర్లు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రస్తుతం రోజుకు 10 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తీస్తున్నారు. 3 వేల టన్నుల బొగ్గు వస్తుంది. వర్షం కారణంగా ఇది పూర్తిగా నిలిచిపోయింది. క్వారీలో చేరిన నీటిని భారీ సామర్థ్యం ఉన్న పంపులతో బయటకు తోడేస్తున్నారు. వర్షం పూర్తిగా తగ్గితేనే క్వారీ నడుస్తుందని మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.
 
							ఎడతెరిపి లేని వాన

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
