రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి.. | - | Sakshi
Sakshi News home page

రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి..

May 2 2025 1:19 AM | Updated on May 2 2025 1:19 AM

రోడ్ల

రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి..

● వీధి దీపాలు వెలుగడం లేదు.. ● కమిషనర్‌తో ఫోన్‌ ఇన్‌లో సమస్యల వెల్లువ

ప్రశ్న: హైటెక్‌సిటీ కాలనీలో రోడ్లు గుంతలుగా ఉన్నాయి. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నుంచి మురుగు నీరు రోడ్లపైకి పారుతోంది. తాగునీరు సన్నగా రావడం వల్ల సరిపోవడం లేదు. ఎక్కువ సమయంతోపాటు నీరు బాగా వచ్చేలా చూడాలి.

– తౌటం సరళ, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్‌రావు, ప్రకాశ్‌, రవికుమార్‌, హైటెక్‌సిటీ కాలనీ

కమిషనర్‌: హైటెక్‌సిటీ కాలనీలో రోడ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపునకు ప్రయత్నిస్తున్నాం. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీలో సమస్య వల్ల అక్కడక్కడ మురుగు నీరు లీకేజీతో రోడ్లపైకి వస్తోంది. దీని పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తాం.

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపాల్టీ కార్పొరేషన్‌గా మారి మూడు నెలలు పూర్తయినా మంచిర్యాలతోపాటు విలీన మున్సిపాలిటీ నస్పూర్‌, హాజీపూర్‌ మండలంలోని ఎనిమిది గ్రామాల్లో వీధి దీపాలు వెలుగడం లేదు. డ్రెయినేజీలు నిర్మించాలి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి ప్రతీ రోజు చెత్త తీసుకెళ్లేలా చూడాలి.. అంటూ పలువురు గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్‌ శివాజి దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయని, ఆన్‌లైన్‌ సేవలు సక్రమంగా అందడం లేదని ఫిర్యాదు చేశారు.

ప్రశ్న: మా కాలనీల్లో వీధి దీపాలు వెలుగడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పాములు, విషసర్పాలతో భయభ్రాంతులకు గురవుతున్నాం. – చుంచు సత్తయ్య(శ్రీనివాస కాలనీ), నజార్‌, కృష్ణకాలనీ(నస్పూర్‌), మల్లేశ్‌, గర్మిళ్ల, సత్యనారాయణ(వేంపల్లి), సత్యనారాయణ(ముల్కల్ల), వెంకట్‌(వేంపల్లి)

కమిషనర్‌: వీధి దీపాల కోసం ఇటీవల టెండర్ల ప్రక్రియ చేపట్టాం. వారం రోజుల్లో టెండర్లు తెరిచి వెంటనే వీధి దీపాలను కార్పొరేషన్‌ పరిధిలోని అన్నిచోట్ల ఏర్పాటు చేయిస్తాం.

ప్రశ్న: తాగునీటి పైపులైన్‌ లీకేజీ అవుతోంది. రోడ్డుపై నీరు నిలిచి ఇబ్బందిగా మారుతోంది. రోడ్లు ఉన్నా డ్రెయినేజీలు లేక మురుగు నీరు రోడ్లపైకి వచ్చి చేరుతోంది. – మధుసూదన్‌(అర్కలవాడ, మంచిర్యాల), వెంకటయ్య(లక్ష్మీనగర్‌, మంచిర్యాల), సత్తయ్య(శ్రీశ్రీనగర్‌, మంచిర్యాల), హబీబ్‌(జాఫర్‌నగర్‌, మంచిర్యాల)

కమిషనర్‌: తాగునీటి పైపులు లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. అర్కలవాడకు లైన్‌మెన్‌ను వెంటనే పంపించి లీకేజీ సమస్య పరిష్కరిస్తాం. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు ఎక్కడెక్కడ అవసరమనే వివరాలు సేకరిస్తున్నాం. ప్రణాళిక రూపొందించి నిధుల విడుదలను బట్టి నిర్మాణాలు చేపడుతాం.

ప్రశ్న: డ్రెయినేజీపై కంపౌండ్‌ వాల్‌ నిర్మించడంతో నీరు పారడం కష్టంగా మారింది.

– మహ్మద్‌ అసీనుల్లా, ఇస్లాంపుర, మంచిర్యాల

కమిషనర్‌: కార్పొరేషన్‌ నిర్మించిన కట్టడాలు, డ్రెయినేజీలను ఆక్రమించి ఏ కట్టడం ఉన్నా వాటిని పరిశీలించి తొలగిస్తాం. వెంటనే ఆయా కట్టడాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: రైల్వే గేటు దగ్గర చెత్త కుప్పులుగా పోసి ఉంచుతున్నారు. ఈ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. – ఓంప్రకాశ్‌, హమాలివాడ

కమిషనర్‌: చెత్త నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించేలా చూస్తాం. చెత్త తొలగించకుంటే వెంటనే మా దృష్టికి గానీ వార్డు ఆఫీసర్ల దృష్టికి గానీ తీసుకొస్తే చర్యలు చేపడుతాం.

ప్రశ్న: రోడ్లు లేవు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వారం రెండ్రోజులే చెత్తబండి వస్తోంది. నాలుగు రోజులు వచ్చేలా చూడాలి

– సుధీర్‌కుమార్‌, రాయల్‌ టాకీస్‌, నస్పూర్‌, ఎం.కుమార్‌, విద్యానగర్‌, నస్పూర్‌కాలనీ

కమిషనర్‌: నస్పూరు పరిధిలో రోడ్లు వేసేందుకు ఒక ప్యాకేజీలా రూపొందించి ప్రభుత్వానికి పంపించాం. అనుమతులు రాగానే ఆ ప్రాంతంలో రోడ్లు వేస్తాం. తాగునీటి సమస్య లేకుండానే చూస్తున్నాం. రాయల్‌టాకీస్‌ ఏరియాలో తాగునీటి సమస్యను గుర్తించి పరిష్కరిస్తాం. చెత్తబండి రెగ్యులర్‌గా వచ్చేలా చర్యలు తీసుకుంటాం. తడిపొడి చెత్త వేరు చేసి ఇచ్చేలా ప్రజలు సహకరించాలి.

ప్రశ్న: సుభాష్‌నగర్‌లో కల్వర్టు లేక డ్రెయినేజీ నీరు రోడ్డుపై పారుతోంది. హమాలీవాడ హనుమాన్‌ టెంపుల్‌ నుంచి బాలమల్లు తోట వరకు డ్రెయినేజీ వ్య వస్థ లేక ప్రజల రాకపోకలకు ఇబ్బంది మారింది.

– చందు, సుభాష్‌నగర్‌, మంచిర్యాల,

శ్రీరాముల మల్లేశ్‌, హమాలీవాడ

కమిషనర్‌: కల్వర్టు లేక డ్రెయినేజీ నీరు పారకపోతే పరిశీలించి కల్వర్టు నిర్మిస్తాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఇంజినీరింగ్‌ అధికారులను పంపించి పరిశీ లిస్తాం. డ్రెయినేజీ నిర్మాణాలు పదిహేను రోజుల్లో ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: చున్నంబట్టి రోడ్డులోని వంద ఫీట్ల రోడ్డులో వాటర్‌ ట్యాంకు కట్టేందుకు గుంత తవ్వి వదిలేయడం వల్ల ప్రమాదకరంగా మారింది. గుంతను పూడ్చాలి.

– ఉపేందర్‌ తుంగపల్లి, మందమర్రి

కమిషనర్‌: వెంటనే గుంత పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: నర్సరీతో కోతుల బెడద, పాములు, విషపు సర్పాలు వస్తున్నాయి. ఆరో వార్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. – సతీశ్‌కుమార్‌, హైటెక్‌సిటీ కాలనీ, మంచిర్యాల, అర్కల హేమలత, 6వ వార్డు

కమిషనర్‌: హైటెక్‌సిటీ కాలనీ నర్సరీ ద్వారా కోతులు, విష సర్పాలు స్థానికుల ఇళ్లకు రాకుండా చర్యలు తీసుకుంటాం. కుక్కల బెడద తగ్గించేందుకు ఇ ప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. అన్ని వార్డుల్లో యానిమల్‌ కేర్‌ సెంటర్‌ ద్వారా చర్యలు చేపడుతాం.

ప్రశ్న: వీధి దీపాల సమస్య తీర్చండి. ఉన్న లైట్లు తక్కువ వెలుతురుతో వస్తున్నాయి. వెలుతురు ఎక్కువగా వచ్చే దీపాలు ఏర్పాటు చేయాలి.

– సదానందం(గొల్లవాడ మంచిర్యాల), తిరుపతిరెడ్డి(అశోక్‌రోడ్డు), మల్లేశ్‌(గర్మిళ్ల), రావి సురేశ్‌(ఆవోపా కాలనీ, మంచిర్యాల)

కమిషనర్‌: వీధి దీపాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. వారం రోజుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయించేలా చూస్తాం.

ప్రశ్న: ప్రాపర్టీ ట్యాక్స్‌ ఆన్‌లైన్‌ లేక ఇబ్బందిగా ఉంది. ఆన్‌లైన్‌ చేసేలా చర్యలు తీసుకోండి.

– గజ్జల రాజశేఖర్‌, ముల్కల్ల

కమిషనర్‌: విలీన గ్రామాలకు సంబంధించిన వాటి ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్‌తోపాటు ఇతర సదుపాయాలు ఆన్‌లైన్‌ ద్వారా జరిగేలా చూస్తాం.

ప్రశ్న: పాతమంచిర్యాలలో డ్రెయినేజీలు శుభ్రంగా లేవు. సమయం లేకుండా తాగునీటి సరఫరా చేయ డం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశ్రీనగర్‌లో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి.

– పెంట శ్రీనివాస్‌, పాతమంచిర్యాల,

లక్ష్మి, శ్రీశ్రీనగర్‌

కమిషనర్‌: డ్రెయినేజీలు శుభ్రం చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించాం. తాగునీరు ఒకే సమయానికి సరఫరాకు చర్యలు తీసుకుంటాం. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. వీలైనంత త్వరగా నిర్మాణం చేపడుతాం.

ప్రశ్న: కాలేజీరోడ్డులో ఆకతాయిల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. ఉదయం వాకింగ్‌ వెళ్లే వారితోపాటు కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – చింతకింది పద్మావతి, ఎన్టీఆర్‌నగర్‌, మంచిర్యాల

కమిషనర్‌: పోలీసు శాఖ వారి దృష్టికి తీసుకెళ్లి ఆకతాయిల ఇబ్బందులు లేకుండా చూస్తాం.

రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి..1
1/1

రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement