సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర బడ్జెట్ జిల్లా వాసులను నిరాశపర్చింది. ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేవి లేకపోయినా మంచిర్యాల నగరాభివృద్ధి, పలు సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ప్రతిపాదన కొంత ఊరటనిస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేవీ జరగలేదు. స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు చేసినా ఆ మేరకు నిధులు రాబట్టలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు తదితర రంగాల్లో జిల్లా ప్రస్తావన కనిపించలేదు. ప్రత్యేక యూనివర్సిటీ, కాలేజీల ఏర్పాటుపైనా నిరాశే ఎదురైంది.
నగరాభివృద్ధికి నిధులు
కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసిన మంచిర్యాల నగరాభివృద్ధి కోసం నిధులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, కొత్తగూడెం, పాల్వంచ మున్సి పాలిటీలతోపాటు మంచిర్యాల కార్పొరేషన్‌కు మూ డు పథకాల్లో భాగంగా మొత్తం రూ.998కోట్లు కేటా యించారు. ఇందులో జిల్లా కేంద్రానికి ఎంత మొ త్తం కేటాయిస్తారనేది అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో జిల్లా కేంద్రంలో మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి తోపాటు నగర వృద్ధికి దోహదపడనున్నాయి. మంచిర్యాల నగర ముంపు రక్షణ కోసం గోదావరి బ్యాక్ వాటర్ ముంపు కోసం రూ.100కోట్లు కేటాయించా రు. అయితే రాళ్లవాగుపై రక్షణ గోడకు రూ.255 కోట్ల ఖర్చుతో నిర్మించాల్సి ఉండగా, తాజాగా ఈ మేరకు నిధులు కేటాయించారు.
సంక్షేమ పథకాలతోనే ఊరట
రాష్ట్రంలో అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే జిల్లా ప్రజలకు ఊరట కలగనుంది. రూ.22500కోట్లతో ప్రతీ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు 3500 చొప్పున మంజూరు కావడంతో జిల్లాలో నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.24,439కోట్లు ప్రతిపాదిస్తూ, ఆయిల్ ఫాం రైతులకు సబ్సిడీ, యంత్రాల సబ్సిడీపై జిల్లా రైతులకు అందే అవకాశం ఉంది. 119నియోజకవర్గాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే జిల్లాలో మూడు చోట్ల యువతకు ఉపయోగపడున్నాయి. ఇక మహిళా సంఘ సభ్యులకు రుణ బీమా రూ.2లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపుతో జిల్లాలోని సభ్యులకు మేలు జరగనుంది. ఇక గిరిజనుల కోసం ‘ఇందిరా గిరి జల వికాసం’ కింద పోడు రైతులకు పంపుసెట్లు అందించి సాగుకు తోడ్పడనుంది. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ పద్ధతిలో 2028వరకు రాష్ట్రంలో మొత్తం 17000కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు బాగు చేస్తే, జిల్లాలోని రోడ్లకు మోక్షం కలిగే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా ఎకో టూరిజం పరిధిలో ఉండడంతో పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం
మంచిర్యాలకు మొండిచేయి
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి చూపించింది. జిల్లాలో ఒక్క ఇంజినీరింగ్ కాలేజీ లేదు. ఇక్కడ ఉన్న యువత ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. జేఎన్టీ యూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉన్నా మొండిచేయి చూపించారు. గత బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాకపోగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వంతెనను రద్దు చేశారు. తిరిగి అక్కడే వంతె న నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలి. లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి రాజీవ్‌నగర్ మధ్య రైల్వే వంతెన నిర్మాణానికి హా మీనిచ్చినా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.
– రఘునాథ్ వెరబెల్లి,
బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు
సాగునీటికి అరకొరనే..
వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతో సాగునీటి ప్రాజెక్టులకు నిర్వహణ, సిబ్బంది జీ తభత్యాలు, మరమ్మతులు, నిర్మాణం కోసం నిధులు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ ప్రాయోజిత సాగునీటి ప్రాజెక్టులతోపాటు చి న్న, మధ్యతరహా ప్రాజెక్టులకు నిధులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టు నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిధులేవి కేటాయించలేదు. ఇక జిల్లాలో ఉన్న నీల్వాయి ప్రాజెక్టుకు రూ.17కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినా ఆ మేరకు నిధుల ప్రస్తావన రాలేదు. ఇక మంచిర్యాల, చెన్నూరు ఎత్తిపోతల పథకాలకు మోక్షం కలుగలేదు.