బెల్లంపల్లి: బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిలోని పెద్దబుగ్గ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి కార్చిచ్చు రగిలింది. కన్నాల గ్రామం నుంచి బుగ్గ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో గుట్టను ఆనుకుని మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. విలువైన వృక్షాలు మంటల్లో మాడిపోయాయి. వేసవి తీవ్రత పెరగడంతో క్రమంగా ఆకులు రాలిపోయి మంటలు అంటుకుని కార్చిచ్చు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఎగిసి పడుతున్న మంటలతో పెద్దబుగ్గ అటవీ ప్రాంతం కారుచీకట్లో ఎరుపెక్కింది. కాగా నెల రోజుల క్రితం ఈ ప్రాంతంలోనే పులి సంచరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కార్చిచ్చు రగలడంతో అటవీ జంతువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.